Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో బాణా సంచా నిషేదం ఒక తరగతికి వ్యతిరేకమని వస్తున్న తప్పుడు అభిప్రాయాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆనందం ముసుగులో పౌరుల హక్కులకు భంగం కలిగితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని తాము కోరుకుంటున్నట్టు న్యాయమూర్తులు ఎం.ఆర్. షా, ఏ.ఎస్. బోపన్న లతో కూడిన ధర్మాసనం వివరించింది. '' ఆనందం ముసుగులో మీరు (తయారీదారులు) పౌరుల జీవితాలతో ఆడుకోలేరు. మేము ఏ తరగతికీ వ్యతిరేకం కాదు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో మేమిక్కడున్నామనే గట్టి సందేశాన్ని పంపాలని మేము కోరుకుంటున్నాం'' అని ధర్మాసనం తెలిపింది. వివరణాత్మకమైన కారణాల తర్వాతే బాణా సంచాపై నిషేద ఉత్తర్వులు జారీ చేసినట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఆదేశాల అమలు విషయంలో అధికారం కలిగిన యంత్రాంగాలు తప్పనిసరి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వివరించింది. ఈ రోజుకీ బాణా సంచా మార్కెట్లో బహిరంగంగా లభ్యమవుతున్నదని చెప్పింది. కాగా, తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణం తెలియజేయాలంటూ ఆరు బాణాసంచా తయారీదారులను న్యాయస్థానం ఆదేశించింది.