Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు కోల్పోయినవారికి 10 లక్షలు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు : సీఎం విజయన్
తిరువనంతపురం: కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుటుంబ సభ్యులను, ఇండ్లను కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నది. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు పరిహారంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వర్ష సంబంధిత విపత్తుల కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయినవారికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. క్యాబినేట్ మీటింగ్‌లో ఈ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు అందే రూ. 5 లక్షల పరిహారంలో రూ. 4 లక్షలు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి, మరో లక్ష రూపాయలు చీఫ్ మినిస్టర్స్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి అందనున్నట్టు సీఎం చెప్పారు. అలాగే, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్‌కు చెందిన హెచ్. వైశాఖ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని క్యాబినేట్ నిర్ణయించింది. సోమవారం కొచిలో విద్యుదాఘాతంతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. లైఫ్ స్కీం కింద వారికి ఇండ్లు కల్పించనున్నట్టు చెప్పారు.
'వరద ప్రభావిత గ్రామాలను గుర్తించండి' ప్రమాదాల తీవ్రత, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఆధారంగా వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి ఒక జాబితా తయారు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం (ఎస్డీఎంఏ)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వరదల కారణంగా 15 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాలు విపత్తు ప్రభావిత కుటుంబాలుగా పరిగణించబడతాయని సీఎం చెప్పారు. 2018, 2019, 2021 ఏడాదుల్లో సంభవించిన వరదల్లో కోల్పోయిన డాక్యుమెంట్స్ అటెస్టెడ్ కాపీల స్టాంప్ డ్యూటీ, ఫీజును మినహాయించే ఉత్తర్వునూ ఒక ఏడాది పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం చెప్పారు.