Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: మావో యిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నిందితులుగా ఉన్న త్వాహా ఫసల్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిషేధించబడిన మావోయిస్టు గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇద్దరు జర్నలిజం విద్యార్థులు త్వాహా ఫసల్, సుహైబ్లను 2019 నవంబర్‌లో అరెస్టు చేశారు. అయితే, గతేడాది సెప్టెంబర్‌లో కొచ్చిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై మోపబడిన ఆరోపణలు, ప్రాథమిక కేసుపై హేతుబద్ధమైన, సహేతుకమైన సందేహాలు ఉన్నాయని ఆ సమయంలో న్యాయస్థానం పేర్కొంది. కమ్యూనిస్టు భావజాలం, మావోయిజం, వర్గపోరాటానికి సంబంధించిన పుస్తకాలు తమ వద్ద ఉన్నాయని ఎన్ఐఏ ఆధారాలుగా సమర్పించిందని కోర్టు పేర్కొంది. అయితే, నిందితులపై ప్రతికూలంగా నిరూపించలేకపోయింది. ప్రత్యేక కోర్టు తీర్పును ఎన్ఐఏ కేరళ హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు సుహైబ్ బెయిల్ అభ్యర్థనను సమర్థించింది కానీ ఫసల్ బెయిల్‌ను రద్దు చేసింది. అయితే, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఫసల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఎన్ఐఏ సైతం సుహైబ్కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరింది. గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్ఐఏ అభ్యర్థనను తొసిపుచ్చుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిజం విద్యార్థులు త్వాహా, సుహైబ్ల బెయిల్‌ను సమర్థించింది.