Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియా టుడే గ్రూపు దావాపై డీయూజే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇండియా టుడే గ్రూపు చేసిన దాడి పట్ల ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ (డీయూజే) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పరువు నష్టం జరిగిందని పేర్కొంటూ కాపీరైట్ ఉల్లంఘనలు జరిగాయంటూ న్యూస్ వెబ్సైట్ 'న్యూస్‌లాండ్రీ'పై ఇండియా టుడే గ్రూపు రూ.2కోట్లకు దావా వేసింది. నమ్మశక్యం కాని రీతిలో, న్యూస్‌లాండ్రీ ప్రచురించిన 34 వ్యాసాలు, 65వీడియోలను తన వెబ్సైట్ నుంచి, యూట్యూబ్ చానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. మీడియాను విశ్లేషించే, విమర్శించే అతికొద్ది వెబ్‌సైట్‌ల్లో న్యూస్‌లాండ్రీ ఒకటి. భారతదేశంలో మీడియా అధ్యయనాలకు భారీగా కొరత వుంది. ఈ నేపథ్యంలో అటు సమాచారం అందించడంలో, ఇటు మీడియాను విమర్శనాత్మకంగా విశ్లేషించడంలో విశిష్టమైన రీతిలో పనిచేస్తూ న్యూస్‌లాండ్రీ ఆ కొరతను భర్తీ చేస్తోందని డీయూజే పేర్కొంది. పాలక పార్టీ చర్యలు, కార్యక్రమాలను మెజారిటీ మీడియా పొగుడుతున్న సమయంలో న్యూస్‌లాండ్రీ నిర్భయంగా, నిష్కపటమైన రీతిలో వ్యవహరించడాన్ని డీయూజే అభినందించింది. వీటిని విమర్శించడానికి టీవీ టుడే చానెళ్ళ మెటీరియల్స్‌ను ఉపయోగించడాన్ని కాపీరైట్ ఉల్లంఘనలని పేర్కొనడం హాస్యాస్పదమని పేర్కొంది. తమ చానెళ్ళు, యాంకర్లు, మేనేజ్మెంట్ గురించి పరువు నష్టం కలిగించేలా ఏ విధమైన సమాచారాన్ని రాయకుండా, ట్వీట్ చేయకుండా లేదా ప్రచురించకుండా నిలువరించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును కోరడం నమ్మలేని విధంగా వుందని పేర్కొంది. మీడియా తల వంచడానికి కార్పొరేట్లు, వ్యక్తులు చాలా తరచుగా దుర్వినియోగం చేసే పరువు నష్టం చట్టాలను రద్దు చేయాలని డీయూజే పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఒక చిన్న వెబ్‌సైట్‌పై పెద్ద మీడియా గ్రూపు ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడడం తమనెంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని డీయూజే తన ప్రకటనలో పేర్కొంది. మీడియా గ్రూపులు భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్ధించాలి కానీ, దానిపై దాడి చేయరాదని పేర్కొంది.