Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీడీ చట్టానికి మోడీ సర్కార్ సవరణ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో నమోదైన జననాలు, మరణాల డేటాబేస్‌ను కేంద్రం నిర్వహించేందుకు వీలు కలిగేలా జనన, మరణాల నమోదు చట్టం(ఆర్బీడీ), 1969కి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. జనాభా రిజిస్టర్, ఎన్నికల రిజిస్టర్, ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ డేటాబేస్లను ఆధునీకరించడానికి ఈ డేటాబేస్‌ను ఉపయోగించవచ్చునని ప్రతిపాదిత సవరణ పేర్కొంటోంది. ప్రస్తుతం జనన, మరణాల నమోదును రాష్ట్రాలు నియమించిన స్థానిక రిజిస్ట్రార్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే చీఫ్ రిజిస్ట్రార్ రాష్ట్ర స్థాయిలో ఐక్య డేటాబేస్‌ను నిర్వహిస్తూ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్
ఇండియా (ఆర్జీఐ) జాతీయ స్థాయిలో నిర్వహించే డేటాతో దాన్ని విలీనం చేయాలని ప్రతిపాదించబడుతోంది. అంటే ఈ సవరణలు చేయడం వల్ల కేంద్రం సమాంతర డేటా బేస్‌ను నిర్వహించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు గానూ చట్టంలో కొత్తగా సెక్షన్ 3ఏను పొందుపరచాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ సవరణలన్నీ అమలైతే, కేంద్రం జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను అప్డేట్ చేయడానికి కేంద్రం ఈ డేటాను ఉపయోగించవచ్చు. 2010లో మొదటిసారిగా ఈ రిజిస్టర్‌ను రూపొందించారు. 2015లో ఇంటింటికీ తిరిగి సమాచారం సేకరించి సవరించారు. ఇప్పటికే ఎన్పీఆర్లో 119కోట్లల మంది పౌరుల డేటాబేస్ వుంది. జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ను రూపొందించే దిశగా ఇది మొదటి చర్య.పౌరసత్వ నిబంధనలు, 2003లోని రూల్ 4(1) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ఆర్సీ కోసం ప్రతి ఒక్క కుటుంబం, వ్యక్తికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు సేకరించేందుకు, వారి పౌరసత్వ హౌదాతో పాటు నివసిస్తున్న స్థానిక ఏరియాతో పాటు అన్ని వివరాల సేకరణ కోసం ఇంటింటి గణనను దేశవ్యాప్తంగా అమలు జరిగేలా చూస్తుంది.
రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి : సీపీఐ(ఎం) డిమాండ్
జాతీయ స్థాయిలో జనన మరణాలను నమోదచేసే డేటా బేస్‌ను కేంద్రం నిర్వహించేందుకు వీలుగా చట్టానికి చేయదలచిన ప్రతిపాదిత సవరణ అనవసరమైన కేంద్రీకరణ చర్య అని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జనన,మరణాల నమోదు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వుంది. జనన మరణాల నమోదు చట్టం, 1969కి ప్రతిపాదించిన సవరణతో కేంద్రం డేటాబేస్‌ను నిర్వహించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను ఎప్పటికప్పుడు ఆధునీకరించడానికి వెసులుబాటు వుంటుంది. జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ను సిద్ధం చేయడానికి ఎన్పీఆర్ ప్రాతిపదికగా వుంటుంది. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఈ ఎన్పీఆర్-ఎన్ఆర్సీ మినహాయింపు, విభజన చర్య కాగలదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పైగా, ఈ డేటా బేస్‌ను కేంద్రీకరణ చేయడమంటే ఇప్పటికే అమల్లో వున్న నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించింది. జనన, మరణాల నమోదు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.