Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం నిపుణుల కమిటీ విచారించేవి ఇవే..
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ విచారించాల్సిన, దర్యాప్తు చేయాల్సిన, నిర్ధారించాల్సిన అంశాలేమిటి?
ఈ క్రింది ఏడు అంశాలను చూసినట్లైతే నిపుణుల కమిటీ ఏం పరిశీలించాలని సుప్రీం కోర్టు భావిస్తున్నదో అవగతమవుతుంది.
1.స్టోర్ చేసిన డేటాను పొందడానికి, సంభాషణలను వినడానికి, సమాచారాన్ని అడ్డగించడానికి లేదా ఇక్కడ చెప్పలేని మరే ఇతర ప్రయోజనాల కోసమైనా భారత పౌరులకు చెందిన ఫోన్లు లేదా ఇతర పరికరాల్లో పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారా లేదా?
2. ఈ గూఢచర్యం దాడి వల్ల ప్రభావితులైన వ్యక్తులు లేదా బాధితుల వివరాలు
ప్రభుత్వాధినేతలు, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, విద్యార్ధులు, లాయర్లు, జర్నలిస్టులు తదితరులు దాదాపు 161మంది వున్నారని ది వైర్ వెల్లడించింది. ఈ గూఢచర్యం వల్ల వీరందరూ బాగా ప్రభావితమయ్యారని పేర్కొంది.
పెగాసస్ ఆనవాళ్ళు కనుగొనేందుకు వీరిలో కొందరి ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వారిలో ది వైర్‌కి చెందిన జర్నలిస్టులు సిద్దార్ధ్ వరదరాజన్, ఎం.కె.వేణు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సుశాంత్ సింగ్, పరంజరు గుహ థకుర్తా, ఎస్.ఎన్.ఎం. అబ్ది వంటి ఇతర జర్నలిస్టులు, ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్ ఎస్.ఎ.ఆర్. జిలానీ, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు బిలాల్ లోనె, లాయర్ అల్జో పి.జోసెఫ్ ప్రభృతులు వున్నారు.
3. పెగాసస్‌ను ఉపయోగించి భారత పౌరుల వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని 2019లో వార్తలు ప్రచురితమైన తర్వాత ప్రతివాది భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి?
పిటిషనర్ల తరపు ప్రధాన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రస్తుత విచారణ సమయంలో ఈ పాయింట్‌ను ప్రముఖంగా ఎత్తిచూపారు.
హ్యాకింగ్‌కు గురైనట్లు వచ్చిన వార్తలను న్యాయ శాఖ మంత్రి పార్లమెంట్లో అంగీకరించారని, కానీ తర్వాత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో వెల్లడించలేదని, బహుశా అఫిడవిట్లో వెల్లడించి వుండవచ్చని సిబాల్ వాదించారు. ప్రస్తుత ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్నా పార్లమెంట్లో మాట్లాడుతూ పెగాసస్‌ను ఉపయోగించి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయని, కానీ అవన్నీ బూటకమని, అన్ని పార్టీలు తిరస్కరించాయని తెలిపారు. కాగా ఇది తప్పుదారి పట్టించే వ్యవహారమని ది వైర్ పేర్కొంది. ఆర్టిఐ ప్రశ్నలకు, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు ఐటి మంత్రిత్వ శాఖే సమాధానాలు ఇచ్చిందని తెలిపింది.
4. భారత పౌరులపై ప్రయోగించేందుకు గానూ పెగాసస్ స్పైవేర్‌ను ప్రతివాది భారత ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనా కొనుగోలు చేశాయా?
కేవలం ప్రభుత్వ క్లయింట్లకు మాత్రమే తాము వీటిని విక్రయిస్తామని పెగాసస్‌ను విక్రయించే ఎన్ఎస్ఓ గ్రూపు తెలిపింది. పెగాసస్ ప్రాజెక్టు నివేదికల చుట్టూ తలెత్తుతున్న పలు కీలకమైన ప్రశ్నల్లో ఇదొకటి.
జాతీయ భద్రతను సాకుగా చెబుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇది సుప్రీం కోర్టుకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
5. ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఈ దేశ పౌరులపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తే, ఏ చట్టం, నిబంధన, మార్గదర్శకాలు, ప్రొటోకాల్ లేదా చట్టబద్ధమైన విధానాలల కింద వీటిని ఉపయోగించారు?
6.ఏదైనా దేశీయ సంస్థ లేదా వ్యక్తి ఈ దేశ పౌరులపై స్పైవేర్‌ను ఉపయోగిస్తే, అటువంటి ఉపయోగం అధికారాన్ని కలిగి వుందా లేదా?
పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం అక్రమమని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్ విధులన్నింటినీ కవర్ చేయగలిగేలా వుండడం, తర్వాత దాన్ని నిఘా పరికరంగా ఉపయోగించడం భారతీయ చట్టాలు పౌరులకు అందించే రక్షణలకు విరుద్ధంగా వుంటుందని అధికారులు చెబుతున్నారు. సమాచార సాంకేతిక చట్టం కింద ఈ రక్షణలన్నీ హ్యాకింగ్‌ను నిరోధిస్తాయని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్‌కి చెందిన అపర్ గుప్తా పేర్కొన్నారు. ఇది క్రిమినల్ నేరం కిందకు వస్తుందంటున్నారు. ఇవి నిజమని రుజువైతే, స్పైవేర్‌ను చొప్పించడానికి విరుద్ధంగా వుండే నిబంధనలివి.
7.పైన పేర్కొన్న నిబంధనలకు అనుబంధంగా లేదా యాధృచ్ఛికంగా అనుసంథానించబడిన మరే ఇతర అంశమైనా లేదా కోణమైనా కమిటీ విచారణకు లేదా దర్యాప్తుకు సరైనదని భావించవచ్చు.
ఏం సిఫార్సు చేయాలి ?
తీర్పు నుండి ఉటంకించిన ఈ క్రింది అంశాల్లో సిఫార్సులు చేసేందుకు కమిటీకి సుప్రీం కోర్టు అధికారమిచ్చింది.
1.నిఘాకి సంబంధించిన, మెరుగైన గోప్యతా హక్కును పొందడం కోసం ప్రస్తుతమున్న చట్టాలు, విధానాలకు సవరణలు చేయడానికి సంబంధించి
2. దేశం, దేశ ఆస్తుల సైబర్ భద్రతను పెంపొం దించ డానికి సంబంధించి
3. స్పైవేర్ల ద్వారా, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల ద్వారా లేదా చట్టానికి లోబడి వుండకుండా పౌరుల గోప్యతా హక్కుపై దాడిని నివారించడానికి హామీ కల్పించేలా
4. తమ పరికరాలపై అక్రమంగా నిఘా పెట్టారన్న అనుమానంతో తమ ఇబ్బందులను తెలియచేసేందుకు పౌరులకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి
5. సైబర్ భద్రత దాడులపై, దాడి ముప్పునకు సంబంధించి, దేశంలో సైబర్ దాడుల ఘటనలపై దర్యాప్తుకు స్వతంత్ర ప్రీమియర్ సంస్థను ఏర్పాటు చేయడానికి సంబంధించి,
6. ప్రస్తుతమున్న లోపాలను పార్లమెంట్ పూరించేవరకు, పౌరుల హక్కుల రక్షణకు తాత్కాలిక చర్యగా ఈ కోర్టు చేయగలిగే తాత్కాలిక ఏర్పాటుకు సంబంధించి,
7. కమిటీ దర్యాప్తుకు సరైనదిగా భావించే మరే ఇతర అనుబంధ అంశమైనా
కమిటీ విధి విధానాలు
నిపుణుల కమిటీకి వుండే అధికారాలను, దాని పనితీరును కూడా సుప్రీంకోర్టు వివరించింది.
పైన పేర్కొన్న 13 ప్రస్తావనాంశాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు, సమాధానం చెప్పేందుకు స్వంతంగా విధి విధానాలను రూపొందించుకునేందుకు, తాము దర్యాప్తు చేయాలనుకున్న ఏ అంశంపైన అయినా విచారణ లేదా దర్యాప్తు నిర్వహించేందుకు, ఈ దర్యాప్తుకు సంబంధించి ఏ వ్యక్తి స్టేట్మెంట్ అయినా తీసుకోగలిగే అధికారం నిపుణుల కమిటీకి ఇవ్వబడింది. తన దర్యాప్తు పరిధిలో ఏ వ్యక్తి లేదా అథారిటీ రికార్డులనైనా కోరవచ్చు.
పర్యవేక్షక న్యాయమూర్తిగా జస్టిస్ రవీంద్రన్‌కు తన విధి నిర్వహణలో భాగంగా పదవిలో వున్న లేదా రిటైరైన న్యాయమూర్తి, న్యాయ నిపుణులు లేదా సాంకేతిక నిపుణుల సాయం కోరే స్వేచ్ఛ వుంటుంది.
కమిటీ సభ్యులతో చర్చించి వారి గౌరవ వేతనాన్ని నిర్ధారించాల్సిందిగా కోర్టు జస్టిస్ రవీంద్రన్‌ను కోరింది. వెంటనే ఈ గౌరవ వేతనాన్ని చెల్లించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.
కమిటీ సభ్యులకు అవసరమైన సాయాన్ని - మౌలిక సదుపాయాల అవసరాలకు సంబంధించిన తోడ్పాటును, సిబ్బందిని, నిధులను, కమిటీకి అవసరమైన మరే ఇతర సాయాన్ని అయినా అందచేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను, ప్రభుత్వాల అధీనంలోని సంస్థలను, వ్యక్తులను ఆదేశించింది. వారికి అప్పగించిన విధులను, కర్తవ్యాలను సమర్ధవంతంగా, సత్వరిగతిన పూర్తి చేయడానికి అవసరమైన తోడ్పాటును అందించాలని ఆదేశించింది.
కమిటీ, జస్టిస్ రవీంద్రన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం, కమిటీ, పర్యవేక్షక న్యాయమూర్తి, వారికి సాయం చేసేందుకు నియమించబడిన వారి అభ్యర్ధనలను అమలు చేసేందుకు, సాఫీగా, సజావుగా పని జరిగేలా చూసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పెషల్ డ్యూటీ ఆఫీసర్, సుప్రీం రిజిస్ట్రార్ వీరేంద్ర కుమార్ బన్సాల్‌ను కోర్టు ఆదేశించింది.