Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1159 పాయింట్లు ఫట్.. 4.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: గత కొన్ని నెలల నుంచి నూతన రికార్డులను నెలకొల్పిన దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ దిద్దుబాటు (కరెక్షన్) చోటు చేసుకుంది. వారం రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు గురైతున్న సూచీలు.. గురువారం సెషన్లో ఏకంగా భారీ నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడితో ఒక్క పూటలోనే లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం.. అక్టోబర్ ఫ్యూచర్స్ గడువు ముగుస్తుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాల విక్రయానికి తెగబడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో విశ్వాసం సన్నగిల్లింది. ఫలితంగా బీఎస్ ఈ సెన్సెక్స్ 1,158.63 పాయింట్లు లేదా 1.89 శాతం కోల్పోయి 59,984.70కు పడిపోయింది. ఒక దశలో సెన్సెక్స్ 1,336 పాయింట్ల మేర క్షీణించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో అంతకంతకూ పడిపోతూ వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ 354 పాయింట్లు పతనమై 17,857 వద్ద ముగిసింది. ఏప్రిల్ 12న సెన్సెక్స్ 1,708 పాయింట్లు పడిపోగా.. తర్వాత మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. ఒక్క సెషన్లోనే మదుపర్లు రూ.4.82 లక్షల కోట్ల విలువ కోల్పోయారు. నిఫ్టీలో అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి. పిఎస్యు బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా ఐదు శాతానికి పైగా నష్టపోయింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 2-3.5 శాతం మధ్య విలువ కోల్పోయాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 1.96, స్మాల్ క్యాప్ 1.85 శాతం నష్టపో యాయి. నిఫ్టీలో కోల్ ఇండియా భారీగా 3.72 శాతం పతనమైంది. సెన్సెక్స్-30లో 2,295 షేర్లు ప్రతికూల తను ఎదుర్కొగా.. 985 సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ -30లో అదానీ పోర్ట్స్, ఐటిసి, ఒఎన్జిసి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 4.39 శాతం మేర అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. ఇండుస్ఇండ్ బ్యాంక్ 2.94 శాతం పెరిగింది. ఎల్అండ్టి, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, మారుతి, బజాజ్ ఫినాన్స్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. బుధవారం సెషన్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి రూ.9,295.78 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.56 శాతం మేర క్షీణించాయి. మార్కెట్లలో దిద్దుబాటు చర్యలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.