Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముల్ల పెరియార్ డ్యామ్ పరిస్థితిపై కేరళ ఆందోళన
- 30 లక్షల మంది భద్రతకు సంబందించిన అంశం: సుప్రీంకోర్టులో కేరళ
తిరువనంతరపురం: కేరళలో ఉన్న ముల్ల పెరియార్ డ్యామ్ పరిస్థితులపై కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ పరిస్థితులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. దాని స్థానంలో కొత్తది నిర్మించాలని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 126 ఏండ్ల చరిత్ర కలిగిన ముల్ల పెరియార్ డ్యామ్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దీనిని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ డ్యామ్ ప్రస్తుతం పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యామ్‌లో నీటిమట్టం సైతం గరిష్ట స్థాయికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదనే ముందస్తు చర్యల్లో భాగంగా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గించాల్సిన అవసరముందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. డ్యామ్‌లో నీటిమట్టం 139 అడుగులు దాటకుండా చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2014లో సుప్రీంకోర్టు విధించిన 142 అడుగు నీటిమట్టం పరిమితి కంటే ఇది మూడు అడుగులు తక్కువ. డ్యామ్‌లో నీటి నిర్వహణకు సంబంధించి ఓ సుపర్వైజరీ కమిటీని సైతం కోర్టు నియమించింది. తాజాగా డ్యామ్‌లో నీటిమట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని ఈ కమిటీ అభిప్రాయాన్ని కేరళ వ్యతిరేకించింది. ఈ వారంలో ప్రారంభం కాబోయే రుతుపవనాలు ముల్ల పెరియాడ్ డ్యామ్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లోను ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే కేరళ అవుట్‌ఫ్లోను పెంచాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈ డ్యామ్ పరివాహక ప్రాంతం, నిల్వ సామర్థ్యం వివరాలు ప్రస్తావించింది. ఈ డ్యామ్ దిగువన నివసిస్తున్న ఐదు జిల్లాలకు చెందిన 30 లక్షల మంది ప్రజల జీవితాలు, భద్రతకు సంబంధించి తమ భయాలకు తగిన పరిశీలనలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అటు తమిళనాడు ప్రజల నీటి అవసరాలను తీర్చడం, కేరళ ప్రజల భద్రతను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం డ్యామ్ స్థానంలో కొత్తది నిర్మించాల్సిన అవసరముందని తెలిపింది. ఈ విషయంపై ఇదివరకే కేరళ సీఎం పినరయి విజయన్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు.