Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలోని ఇడుక్కిలో రెడ్ అలర్ట్
తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి జిల్లాలో గల ముళ్లపెరియార్ డ్యామ్ షట్టర్లను అధికారులు తెరిచారు. రిజర్వాయర్‌లోని నీటి మట్టం 138 ఫీట్లకు మించడంతో రెండు గేట్లను ఎత్తారు. ఈ సమయంలో కేరళ రెవెన్యూ మంత్రి కే. రాజన్, రాష్ట్ర నీటి వనరుల మంత్రి రోషి అగస్టీన్ లూ అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం డ్యామ్‌కు చెందిన మూడు, నాలుగు గేట్లను 0.30 మీటర్ల మేర తెరిచినట్టు ఒక అధికారి తెలిపారు. ఉదయం నుంచి 538.16 క్యూసెక్కల నీరు ఈ రెండు షట్టర్ల నుంచి విడుదలైనట్టు అధికారిక వర్గాలు చెప్పాయి. కాగా, కేరళలో ఈ నెలలో కురిసిన భారీ వర్షాల ఫలితంగా డ్యాంలో నీటి మట్టం పెరిగింది. ప్రజల భద్రతకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున భయపడాల్సిన పని లేదని స్థానికులను మంత్రి రాజన్ కోరారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రత్యేక టీంలు ఏర్పాటు
కాగా, గేట్లు ఎత్తడంతో ఇడుక్కిలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి విడుదలైన నీటిని ఇడుక్కి రిజర్వాయర్ నిలువరించగలదని మంత్రి అగస్టీన్ చెప్పారు. గేట్లు ఎత్తివేయడానికి ముందు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డ్యాం దిగువన నివసిస్తున్న 350 కుటుంబాలకు చెందిన 1079 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఇటు రెవెన్యూ, హెల్త్, అటవీ, పోలీసుతో పాటు పలు విభాగాల్లో ప్రత్యేక టీంలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహణ కూడా జరగనున్నది.