Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారాంతంలోనూ బేర్ పంజా
- సెన్సెక్స్ మరో 678 పాయింట్ల పతనం
- రిటైల్ మదుపరి విలవిల
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ సెన్సెక్స్్, నిఫ్టీలు పతనాన్ని చవి చూశాయి. శుక్రవారం సెషన్లో ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే మార్కెట్ విలువ రూ.2 లక్షలు క్షీణించింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు పతనమయినప్పటికీ.. ఆ తర్వాత కొంత పుంజుకుని తుదకు 677.70 పాయింట్లు లేదా 1.13 శాతం క్షీణించి 59,306.93కు పడిపోయింది. ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర కోల్పోయి ఏకంగా 59,089 కనిష్టానికి దిగజారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా 185.60 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టంతో 17,671 వద్ద ముగిసింది. బిఎస్ఇలో లార్జ్ క్యాప్ 0.88 శాతం కోల్పోగా, మిడ్ క్యాప్ 0.2 శాతం స్వల్ప లాభాలతో ముగిసింది. స్మాల్ క్యాప్ సూచీ 0.4 శాతం ప్రతికూలతను ఎదుర్కొంది. బిఎస్ఇలోని 3,399 షేర్లలో 1,727 షేర్లు లాభాలతో, 1,819 స్క్రిప్ట్‌లు నష్టాలతో ముగిశాయి. మూడో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు మద్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టపోయాయి. వరుస నష్టాలతో రిటైల్ మదుపర్లు బోరుమంటున్నారు. సెన్సెక్స్-30లో కేవలం 9 సూచీలు మాత్ర మే లాభపడ్డాయి. మిగితా 21 సూచీలు నష్టాల పాలయ్యాయి. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు 2.38 శాతం క్షీణించడంతో ఆ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.16.09 లక్షల కోట్లకు తగ్గింది. రంగాల వారిగా ఐటి, ప్రయివేటు బ్యాంకింగ్ సూచీ 1.5 శాతం విలువ కోల్పోయాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ రెండు శాతం నష్టపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సిటిసి షేర్ రోజంతా తీవ్ర ఒడిదుడు లకు గురై తుదకు 7.85 శాతం పతనం తో రూ.845.65 వద్ద ముగిసింది. ప్రయివేటు రంగ బ్యాంక్‌ల సూచీలు వరుస ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయని జియోజిత్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నయ్యర్ పేర్కొన్నారు.