Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ అనుమతులు పొందే వరకు ముందుకు వెళ్లొద్దు
- తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. పర్యావరణ అనుమతులు పొందే వరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. పర్యవరణ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ చెందిన రైతులు డి. చంద్రమౌళేశ్వర రెడ్డి, అవ్వా వెంకటసుబ్బా రెడ్డి, ఎస్కె జానీ బాషా, వజ్రాల కోటి రెడ్డి, నారబోయిన వెంకట రావు, సిద్దడపు గాంధీ, గరికపాటి వెంకటరామ నాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. ''2016లో ట్రిబ్యునల్ ఇచ్చిన అనుమతుల మేరకు మేము తాగు నీటి ప్రాజెక్టు పనులు మాత్రమే చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అయితే, తాగునీటి పనులు మాత్రమే చేపడుతామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని ట్రిబ్యునల్ అంగీకరించినప్పటికీ తాగునీటికి ఎంత మేర జలాలు అవసరం పడుతాయి. కేవలం తాగునీటికే ప్రాజెక్టు పరిమితమా..? వంటి మెరిట్స్‌లోకి వెళ్లలేదు. ఈ కోణాల్లో విచారణ జరపడానికి మేము సంయుక్త కమిటీని నియమించాం. తాగునీటికి కేవలం 7.5 టిఎంసిల జలాలు మాత్రమే అవసరమైనప్పటికీ 90 టీఎంసీల సామర్థ్యంలో ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారనీ, అందులో సాగునీటి పనులు కూడా ఉన్నాయని కమిటీ తేల్చింది. కేవలం తాగునీటి ప్రాజెక్టు పనులు మాత్రమే చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను ఒకవేళ అంగీకరించి 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతిస్తే, ఇక నీటి సరఫరాకు కాలువలు తీయడం మినహా సాగునీటి అవసరాలకు ఏం మిగులుతుంది...? అంతకు మంచి ఏమి ఉండదు'' అని తీర్పులో ఎన్జీటీ పేర్కొంది. రెండింటికి కలిపి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పడం సరికాదని సూచించింది. కాగా, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సభ్యులు తప్ప... సంయుక్త కమిటీలో ఉన్న అందరు సభ్యులు అంగీకరించి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు జరిగాయని ప్రాథమికంగా తాము సంతృప్తి చెందామని తెలిపింది. ''ఈ పరిణామాల రీత్యా ప్రాజెక్టు పనులను అపకపోతే పర్యావరణానికి కోలుకోదనీ, బాగుచేయలేంత హాని కలుగుతుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ ప్రభావం మదింపు నోటిఫికేషన్- 2006 ప్రకారం పర్యావరణ అనుమతులు పొందే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు ప్రాథమిక వాదనలను ఎన్జీటీ తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టు లేదని, దీనికి కేఆర్ఎంబీ అనుమతులు అవసరమని చేసిన వాదనపై విచారణ జరపడం ట్రిబ్యునల్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అయితే, పర్యావరణంపై ఈ ప్రాజెక్టు ప్రభావం, పర్యావరణ ఉల్లంఘనలపై విచారణ జరిపే పరిధి తమకు ఉందని తెలిపింది. పిటిషనర్లు పర్యావరణ కోణంలో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఈ పిటిషన్‌ను విచారించే అధికారం తమ ఉందని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం వివాదానికి దారితీసిన కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోపే పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ చేసిన వాదన వాస్తవమేననీ, సెక్షన్ 15 ప్రకారం ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు తమకు అధికారం ఉందని తెలిపింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. పర్యావరణ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తున్న తరుణంలో ప్రతీ ఉల్లంఘనను మొదటి కాజ్ ఆఫ్ యాక్షన్‌గా పరిగణించాల్సి ఉంటుందని ప్రస్తావించింది. ఈ కారణంగా ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.