Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ గెలుపునకు భారత్‌లో వేడుకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
న్యూఢిల్లీ: పాక్ గెలుపుకు భారత్‌లో వేడుకలు నిర్వహించడం రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ గుప్తా తెలిపారు. ఈ విధంగా ఆలోచించడం వారి అజ్ఞానానికి నిదర్శనమ న్నారు. ఇటీవల టి20 మ్యాచ్‌లో భారత్‌పై పాక్ గెలిచినందుకు వేడుకలు నిర్వహించారంటూ ముగ్గురు కాశ్మీర్ విద్యార్థులను యూపీ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం వారిపై రాజద్రోహ చట్టాన్ని ప్రయోగించింది. ఈ అంశం దీపక్ గుప్తా 'ద వైర్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్ గెలుపుకు వేడుకలు చేసుకున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేస్తామంటూ యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ట్వీట్ చట్టానికి వ్యతిరేకమనీ, ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైనదని చెప్పారు. వారు వేడుకలు జరుపుకోవడం అజ్ఞానమో లేదా అనాలోచిత నిర్ణయమో అయితే కావచ్చు.. కానీ, చట్ట వ్యతిరేకమైనదీ, నేరపూరితమైనది కాదన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులపై బనాయించిన సెక్షన్లూ సరికాదన్నారు. సెక్షన్ 153ఏ (మతం ఆధారంగా శతృత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 66ఎఫ్ ఐటీ చట్టం కింద (సైబర్ ఉగ్రవాదానికి పాల్పడటం), సెక్షన్ 505 (1) (బీ) (రాష్ట్రానికి లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా నేరానికి పాల్పడటం, ఇతరులను ప్రేరేపించేవిధంగా ప్రకటనలు చేయడం) ఆ కాశ్మీర్ విద్యార్థులపై యూపీ ప్రభుత్వం బనాయించింది. వేడుకలు నిర్వహించడం శతృత్వాన్ని ప్రోత్సహించడం ఎలా అవుతుందనీ, కేవలం వారు నిర్దిష్ట మతానికి చెందినందున, వారు హిందూ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలుచేయలేదు.. లేనపుడు సెక్షన్ 153ఏను ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు. ఇతరులతో సంబంధం లేకుంగా వారు మాత్రమే వేడుకలు జరుపుకున్నారు. ఇతర విద్యార్థులను కూడా వేడుకలు జరపాలంటూ బెదిరిస్తే.. అది నేరం అవుతుందనీ, విద్యార్థులపై నిందలు వేయలేమనీ, సెక్షన్ 505(1)(బీ) ప్రయోగించలేరని అన్నారు. తాను యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్, కాశ్మీర్ విద్యార్థులపై మాత్రమే స్పందించానని, జమ్ముకాశ్మీర్‌లో జరిపిన పాక్ విజయోత్సవాలపై కాదని స్పష్టం చేశారు. రాజద్రోహంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను యూపీ ముఖ్యమంత్రి కానీ, ఆయన కార్యాలయం కాని పరిశీలించి ఉంటే ఆగ్రాలోని కాశ్మీరీ విద్యార్థులు చేసింది కచ్చితంగా రాజద్రోహం కాదని వారికి తెలిసి ఉండేదని అన్నారు. నాగరిక ప్రజాస్వామ్యంలో రాజద్రోహానికి స్థానంలేదని స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలన్నదే తన అభిమతమని తెలిపారు. ఒక వేళ అది జరగకపోతే.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వుంటుందని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా సుప్రీంకోర్టు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నానని అన్నారు.