Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రైతులు ఆందోళన తెలుపుతున్న ఢిల్లీ-హర్యానా సరిహద్దు టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్ ప్రాంతాల్లో బారికేడ్లను పోలీసులు తొలగించారు. జేసీబీ, క్రైయిన్లతో పాటు ఇతర భారీ వాహనాలతో బారికేడ్లు, ఫెన్సింగ్, కంటెనర్లు, సిమెంట్ దిమ్మలు వంటివి తొలగించారు. గతేడాది నవంబర్ 26 నుంచి రైతు ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద అప్పటి నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. భారీస్థాయిలో కంటైనర్లు, బారికేడ్లు, సిమెంట్ దిమ్మలు, ఫెన్సింగ్, ముళ్ల కంచెలు వేశారు. అయితే ఇటీవలి సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఆందోళన చేసే హక్క రైతులకు ఉందనీ, కాకపోతే రోడ్లు నిరవధికంగా అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొంది. దీనిపై రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పందిస్తూ తాము రోడ్లను అడ్డుకోలేదనీ, ఢిల్లీ పోలీసులే తమను ఢిల్లీలోకి ప్రవేశించకుండా రోడ్లను దిగ్బంధించారని స్పష్టం చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన దిగ్బంధనానికి పోలీసులే బాధ్యులని రైతు సంఘాలు సుప్రీంకోర్టుకు తెలిపిన కొద్ది రోజులకే పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతాల వద్ద ఉన్న బారికేడ్లను తొలగించారు. ఢిల్లీ పోలీస్ చీఫ్ రాకేష్ అస్థానా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులు ''రోడ్లను మూసివేయలేదు'' అని పేర్కొన్న కొన్ని గంటల తరువాత బారికేడ్లను తొలగించడం జరిగింది. ''మేము ఢిల్లీకి వెళ్లే రహదారిని మూసివేయలేదు. శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు ఢిల్లీలో బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఇది అవసరం. అప్పటి నుంచి రైతులు గుడారాలు వేశారు. అందుకే ముసివేశారు'' అని పేర్కొన్నారు.
రోడ్డును అడ్డుకోవడం రైతుల నిరసనలో భాగం కాదు : రాకేష్ టికాయత్
బారికేడ్ల తొలగింపుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేష్ టికాయత్ స్పందిస్తూ రోడ్లను దిగ్బంధించడం తమ నిరసనలో భాగం కాదని స్పష్టం చేశారు. తమ ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశిస్తాయనీ, తమ ఉత్పత్తులను విక్రయించడానికి పార్లమెంటుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. ''రైతులు ఎక్కడైనా వెళ్ళి పంటలను అమ్ముకోవచ్చని ప్రధాని మోడీ చెప్పారు. రోడ్లు తెరిచి ఉంటే, మేం మా పంటలను అమ్ముకోవడానికి పార్లమెంటుకు వెళ్తాం. మేం రోడ్లను అడ్డుకోలేదు'' అని స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్లో భారీ కిసాన్ మహా పంచాయత్
మధ్యప్రదేశ్లోని నరసింగ్పూర్ జిల్లాలో గదర్వార ధాన్యం మార్కెట్లో భారీ కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈ సభలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మకమైన రైతుల ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని తీవ్రతరం చేయాలని ఎస్కెఎం నేతలు మధ్యప్రదేశ్ రైతులను కోరారు.