Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో వ్యవసాయ రంగంలో 10,677 మంది ఆత్మహత్యలు
- మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ
- అందులో 5,579 మంది రైతులు
- 5,098 మంది వ్యవసాయ కార్మికులు
- 639 మంది కౌలు రైతులు : ఎన్సీఆర్బీ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో ఏడాదిలో ఒక్క వ్యవసాయ రంగంలోనే 10,677 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక స్పష్టంచేసింది. అందులో పురుషులు 9,956 మంది కాగా, మహిళలు 721 మంది ఉన్నారని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎన్సీఆర్బీ దేశంలో ఆత్మహత్యలు, ప్రమాదాల మరణాలు-2020 నివేదికను విడుదల చేసింది. దేశంలో ఏడాదిలో 1,53,052 మంది ఆత్మహత్యల కు పాల్పడగా, అందులో ఎక్కువ మంది రోజువారీ కూలీలు (24.6 శాతం), గృహిణులు (14.6 శాతం), స్వయం ఉపాధి వ్యక్తులు (11.3శాతం), నిరుద్యోగులు (10.2 శాతం), వ్యవసాయ రంగంలో (7శాతం), విద్యార్థినీ, విద్యా ర్థులు (8.2శాతం), ఉద్యోగులు (9.7శాతం) ఉన్నారు. దేశంలో 2017లో 1,29,887, 2018లో 1,34,516, 2019లో 1,39,123, 2020లో 1,53,052 మంది ఆత్మహత్యలు చేసుకు న్నారు. ఈ ఆత్మహత్యల సంఖ్య 2017 నుంచి క్రమంగా పెరుగుతున్నది. ఆత్మహత్యల్లో మహారాష్ట్ర 19,909 (13శాతం), తమిళనాడు 16,883 (11శాతం), మధ్యప్రదేశ్ 14,578 (9.5శాతం), పశ్చి మ బెంగాల్ 13,108 (8.6శాతం), కర్నాటక 12,259 (8శాతం) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 8,058 (5.3శాతం), ఏపిలో7,043 (4.6శాతం) ఆత్మహత్యలు జరిగాయి.
రైతుల ఆత్మహత్యలు
దేశంలో 5,579 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 5,335 మంది పురుషులు, 244 మంది మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్ర (2,567), కర్నాటక (1,072), ఏపీ (564) రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 466 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 419 మంది పురుషులు, 47 మంది మహిళ రైతులు ఉన్నారు. ఏపీలో 542 మంది పురుషులు, 22 మంది మహిళ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
సొంత భూమి రైతులు
దేశంలో సొంత భూమి కలిగిన 4,940 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో 4,737 మంది పురుషులు, 203 మంది మహిళ రైతులు ఉన్నారు. మహారాష్ట్ర (2,324), కర్నాటక (1,035), ఏపీ (424) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 343 మంది సొంత భూమి కలిగిన రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 310 మంది పురుషులు, 33 మహిళా రైతులున్నారు. ఏపీలో 424 మంది సొంత భూమి కలిగిన రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 407 మంది పురుషులు, 17 మంది మహిళ రైతులు ఉన్నారు.
కౌలు రైతులు
దేశంలో 639 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 598 మంది పురుషులు, 41 మంది మహిళలు ఉన్నారు. మహారాష్ట్ర (243), ఆంధ్రప్రదేశ్ (140), తెలంగాణ (123) రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏపీలో 140 మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడగా, అందులో 135 మంది పురుషులు, ఐదుగురు మహిళా కౌలు రైతులు ఉన్నారు. తెలంగాణలో 123 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 109 మంది పురుషులు, 14 మంది మహిళా కౌలు రైతులు ఉన్నారు.
వ్యవసాయ కార్మికులు
దేశంలో 5,098 మంది వ్యవసాయ కార్మికులు బలవన్మరణానికి పాల్పడగా, అందులో 4,621 మంది పురుషులు, 477 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర (1,439), కర్నాటక (944), మధ్యప్రదేశ్ (500) రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏపిలో 325 మంది వ్యవసాయ కార్మికులు బలవన్మరణానికి పాల్పడగా, అందులో 263 మంది పురుషులు, 62 మంది మహిళా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. తెలంగాణలో ఐదుగురు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడగా, అందులో నలుగురు పురుషులు, ఒకరు మహిళ ఉన్నారు.
రోజు వారీ కూలీలు
దేశంలో 37,666 మంది రోజు వారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 33,164 మంది పురుషులు, 4,493 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడు (6,495), మధ్యప్రదేశ్ (4,945), మహారాష్ట్ర (4,176), తెలంగాణ (3,831), గుజరాత్ (2,754) రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 3,831 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 3,058 మంది పురుషులు, 773 మంది మహిళలు ఉన్నారు. ఏపీలో 2,501 మంది రోజు వారీ కూలీలు ఆత్మహత్య చేసుకోగా, అందులో 2,071 మంది పురుషులు, 427 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్ జండర్ ఉన్నారు.
స్వయం ఉపాధి
దేశంలో 17,332 మంది స్వయం ఉపాధి రంగంలో ఉండే వారు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందులో 15,990 మంది పురుషులు కాగా, 1,340 మంది మహిళలు ఉన్నారు. వీరులో వీధి వ్యాపారులు 4,226 మంది, చిన్న వ్యాపారులు 11,716 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వయం ఉపాధిలో తమిళనాడు (2,218), కర్ణాటక (2,181), మహారాష్ట్ర (1,888), మధ్యప్రదేశ్ (1,254), రాజస్థాన్ (1,158), ఒరిస్సా (1,113), తెలంగాణ (1,087), గుజరాత్ (1,015) రాష్ట్రాలు వరుసగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లో 996 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 886 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు
దేశంలో 14,825 మంది వేతన జీవులు (ఉద్యోగులు) ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 2,057 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 439 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1,089 మంది, ఇతర చట్టబద్ద ప్రభుత్వ బాడీల్లో ఉద్యోగులు 529 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో 10,166 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో 2,602 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఉద్యోగుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (2,366), తమిళనాడు (2,359), కర్ణాటక (1,414), మధ్యప్రదేశ్ (1,084), గుజరాత్ (969) మందితో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 581 మంది అందులో 467 మంది పురుషులు, 114 మంది మహిళ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 404 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 333 మంది పురుషులు, 71 మంది మహిళలు ఉన్నారు.
నిరుద్యోగులు
దేశంలో 15,652 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో 12,893 మంది పురుషులు, 2,754 మంది మహిళలు ఉన్నారు. మహారాష్ట్ర (1,843), కేరళ (1,769), తమిళనాడు (1,566), ఒరిస్సా (1,398), కర్నాటక (1,350) రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 150 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో 74 మంది పురుషులు, 76 మంది మహిళలు ఉన్నారు.
విద్యార్థినీ, విద్యార్థులు
అలాగే దేశంలో 12,526 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 6,967 మంది విద్యార్థులు, 5,559 మంది విద్యార్థినీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మహారాష్ట్ర (1,648), ఒరిస్సా (1,469), మధ్యప్రదేశ్ (1,158) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 489 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 305 మంది విద్యార్థులు, 184 మంది విద్యార్థినీలు ఉన్నారు.
గృహిణీలు
దేశంలో 22,374 మంది గృహిణీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గృహిణీల ఆత్మహత్యల్లో మధ్యప్రదేశ్ (3,185), మహారాష్ట్ర (2,570), తమిళనాడు (2,559), పశ్చిమ బెంగాల్ (2,009), కర్నాటక (1,855), గుజరాత్ (1,736), ఛత్తీస్గఢ్ (1,066) రాష్ట్రాలు వరుసగా మొదటి ఏడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లో 748 మంది, తెలంగాణలో 603 మంది గృహిణీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
మహా నగరాల్లో ఆత్మహత్యలు
దేశంలో మహా నగరాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. మహా నగరాల్లో 2017 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2017లో 21,240 మంది మహా నగరాల్లో ఆత్మహత్యలు చేసుకోగా, 2018 (21,408), 2019 (22,390), 2020 (23,855) ఆత్మహత్యలు చేసుకున్నారు. ఢిల్లీ, చెన్నై (తమిళనాడు), బెంగళూర్ (కర్ణాటక), ముంబాయి (మహారాష్ట్ర), అహ్మదాబాద్ (గుజరాత్), సూరత్ (గుజరాత్) నగరాలు మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయి. ఏపిలోని విజయవాడ (324), విశాఖపట్నం (306) మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలోని హైదరాబాదులో 398 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.