Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని పేదలకు ఏకైక వనరుగా నిలిచిన ఉపాధి హామీ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీరును ఆలిండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) ఖండించింది. దేశ జీడీపీలో కీలక భాగస్వామిగా ఉన్న ఉపాధి హామీ గత రెండేండ్లుగా కరోనా మహమ్మారి కాలంలో పేద ప్రజలకు ఉపాధిని కల్పించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను ఏఐఏడబ్ల్యూయూ విడుదల చేసింది. ఉపాధి హామీ చట్టం అమలుకు తగిన నిధులు కేటాయించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది. చట్టం పరిమిత అమలు విషయంలోనూ ఇప్పుడు ప్రభుత్వం నిధుల లేమిని ఎదుర్కొంటున్నదని వివరించింది. ఈ ఏడాది మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రూ. 8,686 కోట్ల నెగెటివ్ బ్యాలెన్స్ ఉన్నదన్న ప్రభుత్వ గణాంకాలపై ఏఐఏడబ్ల్యూయూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 21 వరకు నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటున్నాయని వివరించింది. జీతాలు చెల్లించడంలో కేంద్రం విఫలమవుతున్నదనీ, గతేడాది నమోదైన రోజువారీ కూలీల ఆత్మహత్యలే దీనికి నిదర్శనమని పేర్కొన్నది. చట్టం అమలు విషయంలో నిధులకు సంబంధించిన తక్షణ నిబంధనకు ఏఐఏడబ్ల్యూయూ డిమాండ్ చేసింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు తెలపాలని తమ యూనిట్లకు పిలుపునిచ్చింది.