Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ ప్రమాదాల్లో 3,74,397 మృతి
- మొదటి మూడు స్థానాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
- తెలంగాణలో 11,822 మంది, ఏపీలో 14,653 మంది
- ఎన్సీఆర్బీ-2020 ప్రమాదాల మరణాల నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో వివిధ ప్రమాదాల వల్ల 3,74,397 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2020 (ప్రమాదాల మరణాలు) నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రమాదాల మరణాల్లో మొదటి పది స్థానాల్లో మహారాష్ట్ర 57,806 (15.4శాతం), మధ్యప్రదేశ్ 40,518 (10.8శాతం), ఉత్తరప్రదేశ్ 31,691 (8.5శాతం), కర్నాటక 24,398 (6.5శాతం), రాజస్థాన్ 22,384 (6శాతం), గుజరాత్ 20,799 (5.6శాతం), ఛత్తీస్గఢ్ 20,057(5.4శాతం), ఒరిస్సా 18,888 (5శాతం), తమిళనాడు 18,390 (4.9శాతం), హర్యానా 14,849 (4శాతం)తో నిలిచాయి. తెలంగాణలో 11,822 (3.2శాతం) మంది మరణించగా, వీరిలో 9,868 మంది పురుషులు, 1,954 మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాల్లో 14,653 (3.9శాతం) మంది మరణించగా, వీరిలో 12,062 మంది పురుషులు, 2,590 మహిళలు, ఒక ట్రాన్స్ జండర్ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల 7,405 మంది మరణించారు. అందులో 38.6శాతం పిడుగు పాటు, 13శాతం వరదలు, 10.5శాతం తీవ్రమైన చలి వల్ల చనిపోయారు. 53 మహానగరాల్లో 311 మంది మరణించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల అత్యధికంగా బీహార్ (1,437), ఒరిస్సా (1,428) మరణాలు సంభవించాయి. ఏపీలో 164 మంది మరణించారు. వీరిలో 140 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణలో 170 మంది మరణించారు. వీరిలో 124 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారు.
రోడ్డు, రైల్వేతో సహా వివిధరకాల ప్రమాదాల్లో 5,88,738 కేసులు నమోదు కాగా, అందులో 3,66,992 మంది మరణించారు. 3,38,903 మంది గాయాలు పాలయ్యారు. రోడ్డు, రైల్వే ప్రమాదాలు 39.9 శాతం, హఠన్మరణాలు 13.6 శాతం, నీట మునగటం వల్ల 10.1 శాతం, విషం తాగడంతో 6.1 శాతం, జలపాతంలో కొట్టుకుపోవడం 5.6 శాతం, అగ్ని ప్రమాదాల వల్ల 2.5 శాతం మరణాలు సంభవించాయి. ఈ విభాగంలోని మరణాల్లో మహారాష్ట్ర (57,347), మధ్యప్రదేశ్ (39,957), ఉత్తరప్రదేశ్ (31,166), కర్ణాటక (24,281), రాజస్థాన్ (22,257), గుజరాత్ (20,644) మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 14,489 మంది, తెలంగాణలో 11,652 మంది మరణించారు. దేశంలో 3,68,828 రోడ్డు, రైల్వే ప్రమాదాల నమోదు అయితే, అందులో 3,54,796 రోడ్డు, 1,014 రైల్వే క్రాసింగ్, 13,018 రైల్వే ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 1,46,354 మంది మరణించగా, 3,36,248 మంది గాయాలు పాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో 1,33,201 మంది మరణించారు. 3,35,050 మంది గాయాలు పాలయ్యారు. ఇందులో ద్విచక్ర వాహనదారులు 43.6 శాతం బాధితులు, 13.2 శాతం కారు, 12.8 శాతం ట్రక్కు, లారీ, 3.1 శాతం బస్సు బాధితులు ఉన్నారు. రైల్వే ప్రమాదాల్లో 11,968 మంది మరణించగా, 1,127 మంది గాయాలు పాలయ్యారు. రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో 1,185 మంది మరణించగా, 71 మంది గాయాలు పాలయ్యారు. రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు గరిష్టంగా ఉత్తరప్రదేశ్ (380)లోనే నమోదు అయ్యాయి. రైల్వే ప్రమాదాల్లో గాయాలు పాలైనవారి కంటే, చనిపోయినవారి సంఖ్య అధికంగా ఉంది. అగ్ని ప్రమాదాలకు సంబంధించి 11,037 కేసులు నమోదు కాగా, 9,110 మంది మరణించారు. 468 మంది గాయాలు పాలయ్యారు.