Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల డిమాండ్ల పరిష్కారానికి మార్గం తెరవాలి
- స్పష్టం చేసిన ఎస్కేఎం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందునే ఢిల్లీ పోలీసులు హడావుడిగా బారికేడ్లు తొలగించారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. రోడ్లను పోలీసులే దిగ్బంధించారనీ, రైతులు కాదని పునరుద్ఘాటించింది. ప్రజల దృష్టిలో రైతు ఉద్యమాన్ని తక్కువ చేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలకు పూనుకున్నప్పటికీ, తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దు మార్గాలను పూర్తిగా తెరవాలనుకుంటే, రైతుల డిమాండ్ల పరిష్కారానికి కూడా మార్గాన్ని తెరవాలని ఎస్కేఎం సూచించింది. రైతుల ఆందోళనను అదే ప్రదేశంలో కొనసాగిస్తారా? లేదా ఢిల్లీకి తరలించాలా? అనేది తగిన సమయంలో సమిష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతానికి ఉద్యమంలో భాగమైన రైతులందరూ శాంతియుతంగా ఉండాలనీ విజ్ఞప్తి చేసింది.
లఖింపూర్ ఘటనపై న్యాయవాదుల ప్యానెల్
లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతలో రైతులకు న్యాయ సహాయం అందించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయవాదుల ప్యానెల్‌ను ఎస్కేఎం ఏర్పాటుచేసింది. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై ఈ ప్యానెల్ న్యాయపోరాటం చేయనున్నది. న్యాయవాదుల బృందంతో అవసరమైన విధంగా సమన్వయం చేసుకోవడానికీ, చట్టపరమైన చర్యలలో సహాయం చేయడానికి రైతు సంఘాల నుంచి వాలంటీర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎస్కేఎం న్యాయ బృందం సభ్యులు కూడా యూపీ ప్రభుత్వ సిట్ అధికారులతో సమావేశమయ్యారు. కౌంటర్ ఎఫ్ఐఆర్ (గుర్తు తెలియని వ్యక్తులపై నమోదు)లో అరెస్టు చేసిన ఇద్దరు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యూపీలోని కిసాన్ మహాపంచాయత్
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో శనివారం కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈ మహా పంచాయత్‌లో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. అక్టోబరు 17న జరగాల్సిన పంచాయితీ భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం ముంపునకు గురై వాయిదా పడింది. దీంతో అప్పుడు వాయిదా పడిన కిసాన్ మహా పంచాయత్ శనివారం నిర్వహించారు. పలువురు ఎస్కేఎం నాయకులు మహా పంచాయత్‌లో పాల్గొని, మరింత మంది రైతులు ఢిల్లీ ఆందోళనలకు రావాలని పిలుపునిచ్చారు.