Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ వరుస పర్యటనలు
- సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం
- ఒక్క పూర్వాంచల్‌లోనే ఐదుమార్లు పర్యటించిన ప్రధాని
- ఇదంతా ఎన్నికల కోసమే : రాజకీయ విశ్లేషకులు
- వెంటాడుతున్న 'లఖింపూర్ ఖేరీ' ఉదంతం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం(ఫిబ్రవరి 2022లో) దగ్గరపడుతుండటంతో అధికార బీజేపీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ యూపీకి పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల యూపీలోని పూర్వాంచల్‌లో పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగాయి. రూ.2329 కోట్లతో 9 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి గత సోమవారం సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. దీనికంటే ముందు స్వంత నియోజికవర్గం వారణాసిలో ప్రధాని పీఎం ఆయుష్మాన్ భారత్ కింద 'వైద్య మౌలిక వసతుల కల్పన మిషన్'ను ప్రారంభించారు. అలాగే వారణాసిలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మరో రూ.5200కోట్లు కేటాయించారు. ప్రధాని మోడీ యూపీ ఎన్నికల ప్రచారం వాస్తవానికి జులై 15నుంచి ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. పలు నగరాల్లో వివిధ పేర్లతో పథకాల్ని ప్రారంభిస్తూ ప్రధాని పర్యటనలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 20న కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేశారు. పూర్వాంచల్ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.478కోట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజధాని లక్నోలో అక్టోబర్ 5న జరిగిన ఒక సదస్సులో పాల్గొని ప్రధాని ప్రసంగించారు. గోరఖ్‌పూర్ ఎరువుల ఫ్యాక్టరీ, గోరఖ్‌పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవాలు ప్రధాని మోడీ చేతులమీదుగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేలను డిసెంబర్లో ప్రధాని ప్రారంభించనున్నారు. పాల్గొన ప్రతి కార్యక్రమంలో ప్రధాని మోడీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
రైతుల నుంచి వ్యతిరేకత
పూర్వాంచల్, అవధ్‌లో రైతుల నుంచి బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దీనికి తోడు లఖింపూర్ ఖేరీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అన్నీ కలిసి రైతుల అంశాన్ని పెద్దది చేయకముందే..వేల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ తెరలేపిందని సీనియర్ జర్నలిస్టు శరత్ ప్రధాన్ చెప్పారు. పశ్చిమ యూపీలో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోందని, అందుకే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో బీజేపీ నాయకులు ర్యాలీలు చేపడుతున్నారని చెప్పారు. అధికార బీజేపీ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలన్నీ ఓటర్లు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని, పథకాల ప్రారంభోత్సవాలు కాగితాలకే పరిమితమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా ఎన్నికల వ్యూహం ప్రకారమే!
రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవ్వటం, ప్రతిపక్షాల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం అంతా కూడా ఎన్నికల కోసమేనని విశ్లేషకులు, స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు. రైతు ఉద్యమం పూర్వాంచల్‌లో బీజేపీ విజయావకాశాల్ని దెబ్బ కొడుతుందని, అందుకే రైతు సమస్యలు తెరమీదకు రాకుండా బీజేపీ అనేక వ్యూహాలు పన్నుతోందని రాజకీయ విశ్లేషకుడు బి.డి.శుక్లా చెప్పారు. యూపీ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 403కాగా, పూర్వాంచల్‌లో 102 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 34.49 శాతం ఓట్లతో 69 సీట్లు దక్కాయి. ఎస్పీ-13, బీఎస్పీ-8 స్థానాల్లో గెలిచాయి.
అలాగే అవధ్ ప్రాంతంలో 121 సీట్లు ఉండగా, 2017లో బీజేపీకి 93 స్థానాలు దక్కాయి. ఎస్పీ-10(ఓట్ల శాతం 21.81) , బీఎస్పీ-8 (ఓట్ల శాతం 21.93) స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలకు దాదాపు 44శాతం ఓట్లు వచ్చాయి. పూర్వాంచల్లోనూ ఎస్పీ, బీఎస్పీకి కలిపి 45శాతానికిపైగా ఓట్లు పడ్డాయి.
బీజేపీ వ్యతిరేక ఓటు ఎస్పీ, బీఎస్పీ మధ్య చీలిపోవటం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇది 2022లో రిపీట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం..బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు అనేకమంది ఎస్పీలో చేరారని, మునపటికంటే ఇప్పుడు ఎస్పీ బాగా పుంజుకుందని చెబుతున్నారు. దాంతో ఎస్పీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనపడుతోందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్గనుక పుంజుకుంటే బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతుందని వారు అంచనావేశారు.