Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్‌లోని కచ్‌లో ఘటన
అహ్మదాబాద్ : గుడిలోకి ప్రవేశించినందుకు ఒక దళిత కుటుంబంపై పెత్తందార్లు రెచ్చిపోయారు. బాధిత కుటుంబానికి చెందిన ఆరుగురిపై 20 మంది మూకుమ్మడిగా దాడికి దిగారు. రాడ్లతో, గొడ్డళ్లతో వారిని తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలతో బాధితులు ఆస్పత్రిలో చేరారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని కుచ్‌లో గల ఒక గ్రామంలో చోటు చేసుకున్నది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిలో ఒక కార్యక్రమం సందర్భంగా దళిత కుటుంబం అక్కడకు వెళ్లింది. ఇది తెలుసుకున్న పెత్తందారి కులాలకు చెందిన నిందితులు దళిత కుటుంబంపై దాడికి నిర్ణయించారు. బాధిత కుటుంబానికి చెందిన వాఘేలా మాట్లాడుతూ.. '' గుడిలోకి ప్రవేశించకుండా నిందితులు హెచ్చరించారు. ఒక కార్యక్రమం సందర్భంగా మా కుటుంబ సభ్యులు గుడిలోకి వెళ్లారు. ఇది తెలుసుకున్న నిందితులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కుటుంబంపై దాడికి ప్రణాళికను రచించారు'' అని చెప్పారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబానికి చెందిన పంటను నాశనం చేసేందుకు నిందితులు పశువులను వారి వ్యవసాయ భూమిలోకి విడిచిపెట్టారు. ఇది తెలుసుకున్న వాఘేలా, ఆయన బంధువు అక్కడకు చేరుకున్నారు.
వారిని గమనించిన నిందితులు ఆ ఇద్దరిపై గొడ్డళ్లు, రాడ్లతో దాడికి తెగబడ్డారు. '' వారు (నిందితులు) నా సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఆటోరిక్షాపై దాడి చేయడంతో మేము నిస్సహాయులమయ్యాం. తీవ్ర గాయాలైన మమ్మల్ని పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు'' అని వాఘేలా చెప్పారు. అక్కడి నుంచి వాఘేలా ఇంటికి వెళ్లిన నిందితులు ఆయన తండ్రి (64), ఇతర కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దుండగులు తమను కులం పేరుతో దూషించారని వాఘేలా తండ్రి చెప్పాడు. '' వారు మాపై దారుణంగా దాడి చేశారు. దీంతో మాకు తీవ్ర రక్తస్రావం జరిగింది'' అని ఆయన వివరించారు. కాగా, వాఘేలా, ఆయన కుటుంబీకులు భజ్లోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఈ దాడి ఘటన అనంతరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు సంబంధిత పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.