Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సగం ఆర్థిక సంవత్సరానికే కేటాయింపులు పూర్తి
- రూ.8 వేల కోట్ల రుణాత్మక నికర బ్యాలెన్స్
- రెడ్ జోన్లో 21 రాష్ట్రాలు
- 'ఉపాధి హామీ'ని నీరుగారుస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు , గనులు, నిధులు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ఉపాధి చూపే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) అమలుకు నిధులు ఇవ్వకుండా ఎండగడుతున్నది. కరోనా సంక్షోభం, గ్రామీణ ప్రజల ఉపాధి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, అరకొరగా కేటాయించడం వల్ల ఆర్థిక సంవత్సరం సగంలో ఉండగానే నిధులు ఒట్టిపోయాయి. అనుబంధ బడ్జెట్ కేటాయింపులు కూడా గ్రామీణ ఉపాధిని మరో నెల కూడా రక్షించే స్థితి కనిపించడం లేదు. ఇప్పటికే రూ.8,686 కోట్ల రుణాత్మక నికర బ్యాలెన్స్‌లో ఉందని ఎంజిఎన్ఆర్ఇజిఎ తన సొంత ఆర్థిక నివేదికలో పేర్కొంది. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కింద తమకు కేటాయించిన నిధుల్లో దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు వంద శాతం వినియోగాన్ని ఇప్పటికే దాటేశాయి. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రుణాత్మక బ్యాలెన్స్ చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఎపి, తమిళనాడు రాష్ట్రాల రుణాత్మక బ్యాలెన్స్ వరుసగా రూ.2,323 కోట్లు, రూ.1,999 కోట్లుగా ఉంది.
తగ్గిన కేటాయింపులు
ఎంజిఎన్ఆర్ఇజిఎ ఒక డిమాండ్ ఆధారిత చట్టం. ఇది కోరుకునే ఏ గ్రామీణ కుటుంబానికైనా 100 శాతం నైపుణ్యం లేని పనికి హామీ ఇస్తుంది. గతేడాది కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఈ పథకానికి మొత్తంగా 1.11 లక్షల కోట్లు వరకు కేటాయించారు. ఈ ఏడాది లాక్డౌన్ ముగిసిందని, అవసరమైతే అనుబంధ బడ్జెట్ కేటాయింపులు అందుబాటులో ఉంటాయని పేర్కొంటూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.73 వేల కోట్లే (34 శాతం తక్కువ) ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 29 నాటికి చెల్లించాల్సిన బకాయిలతో సహా మొత్తం వ్యయం ఇప్పటికే రూ.79,810 కోట్లకు చేరింది. తాజా పరిస్థితిపై మజ్దూర్ కిసాన్ శక్తి సంఘస్తాన్ వ్యవస్థాపకులు నిఖిల్ దే మాట్లాడుతూ కరోనా సంక్షోభంతో ఇప్పటికే పేదలు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని అన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ నిధులు కూడా సగం ఆర్థిక సంవత్సరానికే సరిపోయాయని, రాబోయే ఖర్చులను ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు.
చెల్లింపులు మరింత ఆలస్యం
ఉపాధి కార్మికులకు చెల్లింపులు, మెటీరియల్ వ్యయానికి సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు డబ్బుల్లేవు. రాష్ట్రాలపైకి ఈ భారాన్ని నెట్టివేయాలని కేంద్రం చూస్తోంది.కరోనాతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ వేతనాల చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం ద్వారా కార్మికులను బలవంతపు చాకిరీ వైపు నెడుతోందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు జరపని కేంద్రం.. రాష్ట్రాలు కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం తన బాధ్యతనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రం చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా కేత్రస్థాయి పరిస్థితి ఉంది. పని కోరిన వారిలో 13 శాతం కుటుంబాలను పని కల్పించబడలేదని ఎంజిఎన్ఆర్ఇజిఎ డేటా పేర్కొంటోందని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ (పిఎఇజి)కి చెందిన రీసెర్చర్ విజరురామ్ పేర్కొన్నారు.
నిధులు విడుదల చేస్తాం : కేంద్రం
ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు వేత నాలు, మెటీరియల్ చెల్లింపుల కోసం నిధుల విడుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. అదనపు నిధులు అవసరమైన సమయంలో ఆర్థికశాఖను కోరతామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు కోట్లకు పైగా కుటుంబాలకు వేతన ఉపాధి లభించిందని, డిమాండ్‌లో 99.63 శాతానికి ఉపాధి కల్పించబడిందని పేర్కొంది. వేతనాలు, మెటీరియల్ వ్యయం కోసం నిధులు విడుదల ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రస్తుతం రూ.8,921 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.