Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆకలి సూచిలో దిగజారిన భారత్
- అత్యున్నత స్థాయిలో విధానపరమైన చర్యలు చేపట్టాలి..
- ఐరాస, ప్రపంచ ఆకలి సూచికలూ ఇదే చెప్పాయి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారతదేశంలో ఆకలి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి సహా పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆకలి సమస్యను అంతమొందించేందుకు ప్రభుత్వాలు అత్యున్నత స్థాయిలో విధానపరమైన చర్యలు చేపటాలని గట్టిగా సూచించాయి. ప్రపంచబ్యాంక్ 2015నాటి నివేదిక ప్రకారం 'బ్రిక్స్'(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమిలో ఇతర దేశాలతో పోల్చితే..ఆకలి సమస్య భారత్‌లో 2 నుంచి 7 రేట్లు ఉంది. అయితే ఆకలి సమస్యను అరికట్టడంలో భారత్ పరిస్థితి మెరుగుపడాల్సింది పోయి, మరింత క్షీణించిందని ఐక్యరాజ్యసమితి ఇటీవలి నివేదిక (ఎఫ్ఏఓ) ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఐరాస నిర్దేశించిన 'స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో' ముఖ్యమైనది 'జీరో హంగర్'(ఆకలి సమస్య లేకుండా చేయటం). ఈ లక్ష్యాన్ని 2030 కల్లా చేరుకుంటామని భారత్‌కూడా సంతకం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా, వ్యతిరేక దిశలో భారత్ పయనిస్తోందని ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది.
కోవిడ్-19కు ముందు గణాంకాల్ని పరిగణలోకి తీసుకొని ఐరాస తన ఎఫ్ఏఓ నివేదికను విడుదల చేసింది. కోవిడ్ అనంతరం భారత్‌లో ఆకలి సమస్య మరింత పెరిగిందన్న సూచనలు వెలువడ్డాయని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. దీనితర్వాత 'ప్రపంచ ఆకలి సూచిక-2021' కూడా విడుదలైంది. దీంట్లోనూ భారత్ ర్యాంక్ గణనీయంగా పడిపోయింది. 116 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌కు 101వ స్థానం దక్కింది. కడుదయనీయమైన స్థితిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలతో భారత్ పోటీపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పొరుగునవున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనదేశంకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని వారు చెప్పారు.
ఐరాస విడుదల చేసిన 'ఎఫ్ఏఓ' నివేదిక ప్రకారం, సాధారణమైన, చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే వ్యక్తి ఒక నిర్దిష్టమైన కేలరీలతో ఆహారాన్ని తీసుకోవాలి. సుదీర్ఘకాలంగా సరైన ఆహారం తీసుకోకపోవటం, పోషకాహారలోపాన్ని ఐరాస 'ఆకలి సమస్య'గా నిర్ణయించింది. ఇది ఐదేండ్లలోపు చిన్నారుల్లో అనేక శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తోంది. ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, శిశుమరణాలు, వయస్సుకు తగిన ఎదుగుదల లేకపోవటం..పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌కు 101వ ర్యాంక్ ఇచ్చారు. కరోనా మహమ్మారి భారత్‌లో ఆకలి సమస్యను మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆకలి సమస్య తగ్గుముఖం పడుతున్న తరుణంలో కరోనా సంక్షోభం పెద్దదెబ్బ కొట్టిందని ఐరాస భావిస్తోంది. ఈ తరుణంలో భారత్‌లో పాలకులు దీనిపై అత్యవసరంగా దృష్టిసారించాలని, అత్యున్నత స్థాయిలో విధాన నిర్ణయాలు చేసే వారు చర్యలు చేపట్టాలని ఐరాస సూచించింది.