Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు కేంద్రం బీమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బీమా చెల్లింపులు 60శాతం తగ్గాయట. 2020-21 పంటకాలానికి కేవలం రూ. 9,570కోట్ల మేర బీమా చెల్లింపులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే 2019-20లో బీమా చెల్లింపుల మొత్తం రూ. 27,398 కోట్లుగా ఉంది. 2019-20, 2020-21కి సంబంధించి బీమా మొత్తాన్ని కేంద్రం పూర్తిగా చెల్లించినట్టు తెలుస్తోంది. 2020-21 కాలానికి 6.12 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్ బీమా కింద రూ. 1,93,767 కోట్లు బీమా చేయగా.. రూ.9,570కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. వీటిలో ఖరీప్ సీజన్లో రూ.6,779కోట్లు, రబీ సీజన్లో రూ.2,792కోట్లు పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందాయి. దీని బట్టి ఈ ఏడాదిలో భారీ పంట నష్టాలు ఏమీ జరగలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నాయి. 2020-21లో పంట నష్ట పరిహారం గరిష్ఠంగా రూ.3,602కోట్లు రాజస్థాన్ రైతులకు చెల్లించగా.. ఆ తర్వాత మహారాష్ట్రకు రూ.1,232 కోట్లు, హర్యానాకు రూ. 1,112.8 కోట్లు చెల్లించారు.