Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రాయోజిత పథకాలకు 10శాతం నిధులు
న్యూఢిల్లీ : ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాలకు(సీఎస్ఎస్) జమ్మూకాశ్మీర్‌కు రావాల్సిన నిధుల్లో 10శాతం కూడా అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎస్ఎస్ కింద జమ్మూకాశ్మీర్‌కు కేంద్రం నుంచి రూ.18,527కోట్లు విడుదల కావాల్సివుంది. కానీ ఇందులో అక్టోబర్ 27 నాటికి కేవలం రూ.1809కోట్లు మాత్రమే అందాయి. కేంద్ర పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌కు ఈ నిధులు చాలా ముఖ్యం. ఈ నిధుల విడుదలలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జలశక్తి, జీవన్ మిషన్, విపత్తు నిర్వహణ, పునరావాసం, విద్యుత్, పౌర విమానయానం, ఐటీ..మొదలైన విభాగాల్లో సీఎస్ఎస్ కింద రాష్ట్రానికి వేల కోట్లు రావాల్సి ఉందని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించలేదన్న నెపంతో నిధుల్ని కేంద్రం విడుదల చేయటం లేదని ఆయన చెప్పారు. వివిధ విభాగాల్లో పలు కార్యక్రమాలన్నీ నెమ్మదించాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 5 నెలల్లో పథకాల అమలు వేగవంతం కావాలంటే కేంద్రం విడుదల చేసే నిధులే ఆధారమని అన్నారు. ఉదాహరణకు ప్రజా ఆరోగ్యం, వైద్య విద్య, పాఠశాల విద్య, సామాజిక సంక్షేమం, ప్రజా పనులు..విభాగాల్లో రూ.1000కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి వుండగా, ఆయా ప్రభుత్వ విభాగాలకు కనీసం 10శాతం నిధులు కూడా రాలేదని సమాచారం.