Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొరుగు దేశాలకు, మనకు భారీ వ్యత్యాసం
- విజయవాడలో పెట్రోలు రూ.115.94, డీజిల్ రూ.108.55
న్యూఢిల్లీ : నిత్యం పెరుగుదలతో భారత్‌లో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాకిస్తాన్‌తో పోల్చితే మన దేశంలో పెట్రోల్ ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.121.25 కాగా, పాకిస్థాన్‌లో రూ.59.25గా ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల్లో ఇతర పొరుగు దేశాలకు, భారత్‌కు భారీ వ్యత్యాసం ఉంది. పెట్రోలు, డీజిల్‌పై కేంద్రంలోని మోడీ సర్కార్ విధిస్తున్న అధిక ఎక్సైజ్ సుంకం కారణంగానే దేశంలో ఈ విపరీతమైన ధరలు ఉన్నాయన్నది స్పష్టం.
పొరుగు దేశాల్లో బెటర్!
పాకిస్తాన్లో లీటరు డీజిల్ ధర రూ.57.83 మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ.54, రూ.46.43, శ్రీలంకలో రూ.68.33, రూ.41.25, బంగ్లాదేశ్‌లో రూ.78, రూ.56.93, నేపాల్‌లో రూ.81.23, రూ.70.65, మయన్మార్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.65.7, రూ.57.83 మాత్రమే ఉన్నాయి. 53 దేశాల్లో పెట్రోల్ ధరలు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ చాలా వరకు ధనిక దేశాలే కావడం గమనార్హం. ఈ జాబితాలో జింబాబ్వే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మాత్రమే తలసరి ఆదాయంలో భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. హాంకాంగ్‌లో అత్యధికంగా పెట్రోల్ రూ.198.6 కాగా, నెదర్లాండ్స్‌లో రూ.171.15, నార్వేలో రూ.169.5, డెన్మార్క్‌లో రూ.161.1గా ఉంది. ఆయా దేశాల తలసరి ఆదాయాలు చూస్తే భారత్ (1,980 డాలర్లు మాత్రమే) కంటే మెరుగైన స్థాయిలో ఉన్నాయి. హాకాంగ్ తలసరి ఆదాయం 46,733 డాలర్లు, నెదర్లాండ్-48,796 డాలర్లు, నార్వే-75,428 డాలర్లు, డెన్మార్క్-57,545 డాలర్లుగా ఉంది.
కొనసాగుతున్న 'పెట్రో' వాత
దేశంలో పెట్రో ధరాఘాతం కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై వరుసగా నాలుగో రోజు ఆదివారం 35 పైసల చొప్పున పెరిగింది. అత్యధికంగా రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్‌లోని పన్నా, సత్నా, రేవా, షాదోల్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాల్లో పెట్రోల్ ధరల రూ.120 మార్క్‌ను దాటేసింది. విజయవాడలో పెట్రోలు రూ.115.94, డీజిల్ రూ.108.55కు చేరుకున్నాయి.