Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న సారంపల్లి మల్లారెడ్డి
గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్టులో శనివారం ముప్పవరపు ఫౌండేషన్, రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యాన రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ పురస్కారాలను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అందజేశారు. రైతు సమస్యలపై పనిచేసిన, పోరాటాలు సాగించిన వారితోపాటు పలువురు శాస్త్రవేత్తలను సముచితంగా గౌరవించారు. ముందుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త కీర్తిశేషులు పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచికతోపాటు పలు పుస్తకాలను ఆవిష్కరించారు. రైతాంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డిని ఉప రాష్ట్రపతి సన్మానించారు. మల్లారెడ్డితోపాటు 42 మంది రైతులకు, శాస్త్రవేత్తలకు అవార్డులను ఉప రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మాజీ మంత్రి, స్వర్ణ భారతి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్, ముప్పవరపు ఫౌండేషన్ చైర్మెన్ హర్షవర్దన్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.