Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం వారంలో అఖిలపక్షం వేయాలి
- స్టీల్ ప్లాంట్ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
విశాఖపట్నం : 'స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం ఆంధ్రుల ఆత్మ గౌరవం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాల కతీతంగా కలిసి పని చేద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఎలా ఆపుతారో వైసిపి ప్రభుత్వం ప్రకటించాలి. అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించండి. రాజకీయ పార్టీలు, కార్మిక, నిర్వాసిత సంఘాలు, మేధావులతో కలిసి పోరాడితేనే కేంద్రం అర్థం చేసుకుంటుంది. మన పోరాటం చేయకుండా కేంద్రాన్ని అనడం నాకిష్టం లేదు.' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న పోరాటానికి సంఘీభావం ప్రకటించడానికి ఆదివారం సాయంత్రం స్టీల్‌ప్లాంట్ రహదారిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో వైసిపి ప్రభుత్వం తన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదన్నారు. బిజెపి తెస్తోన్న బిల్లులు, చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇస్తోన్న వైసిపి... స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. 32 మంది ప్రాణ బలి దానంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఆ తరువాత కాలంలో కార్మిక సంఘాల పోరాటాలతో నిలబడిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్ల 65 శాతం ముడిసరుకు కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కరోనా సమయంలో కూడా రూ.167 కోట్లు లాభం ప్లాంట్‌కు వచ్చిందన్నారు. పరిశ్రమల్లో పెట్టుబడుల ఉప సంహరణ ఈ రోజు ప్రధాని మంత్రి ద్వారా వచ్చింది కాదని, 1991 నుంచి ప్రారంభమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చట్టసభల్లో తనకు బలం లేదని, బలమున్న వైసిపి పార్లమెంటులో మాట్లా డడం లేదని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ భూమి అంగుళం కూడా అమ్మనీయకుండా పోరాటాలతో అడ్డుకుంటా మన్నారు. ప్రయివేటుపరం కాకుండా డిసిఐని కాపాడుకున్నట్లే, స్టీల్‌ప్లాంట్‌ను కూడా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పరిశ్రమలేని గాలి జనార్థనరెడ్డికి గనులు కేటాయించిన ప్రభుత్వాలు... ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఈ సభలో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యుడు కోన తాతారావు, పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కన్వీనర్ జె.అయోధ్యరాం, నిర్వాసితుల సంఘం నాయకుడు పితాని భాస్కర్ ప్రసంగించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకుంటున్న మోడీ సర్కారును పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనకపోవడం సభలో చర్చనీయాంశమైంది.