Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలం నుంచి ప్రారంభం
అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించా లని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది, పది గంటల మధ్మలో ప్రారంభం కానున్న ఈ యాత్రను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం నుండి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుండి తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే ఈ యాత్ర మార్గమధ్యలో వచ్చే వివిధ మతాలకు చెందిన క్షేత్రాలు, ప్రార్ధనా మందిరాలను రైతులు సందర్శించి తమ గోడును వెల్లబోసుకోనున్నారు. 503..3 కి.మీ దూరం సాగనున్న ఈ యాత్రను తొలుత 32 రోజుల్లో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తరువాత 44 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ యాత్రకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ యాత్రకు అనుమతి ఇవ్వడానికి తొలుత పోలీసులు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఆ తరువాత అనుమతి ఇచ్చినప్పటికీ అనేక ఆంక్షలు విధించారు. దీంతో పాదయాత్ర జరిగే తీరుపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వం హయంలో అమరావతిలో కొంత మేర పనులు జరిగిన పనులు వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులనే ఏర్పాటు చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తామని ప్రకటించడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకే రాజధాని ఉండాలన్న నినాదంతో పాటు, రాజధానికోసం భూములు త్యాగం చేసిన తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరుతూ స్థానిక రైతులు, మహిళలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు.
రైతు సంఘం మద్దతు
అమరావతిని ప్రతిపక్షంలో ఉండగా బలపరిచిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి పనులు నిలిపేయడం సరైన చర్య కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పేర్కొంది. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతు ప్రకటించింది. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.