Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ సభ్యుల, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి
బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. బెంగళూరు నగరం కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రులు రాజ్‌కుమార్, పార్వతమ్మల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినరు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినిమా ఇండిస్టీలోని ఆయన స్నేహితులు, సహచరులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. శుక్రవారం గుండెపోటుతో మరణించిన పునీత్ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచారు. అంత్యక్రియల నిమిత్తం ఆదివారం సూర్యోదయానికి ముందే భౌతికకాయాన్ని స్టేడియం నుంచి స్టూడియో వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలోనే భారీ కాన్వారు మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు పునీత్‌కు చివరిసారిగా నివాళి అర్పించారు. భద్రతా, కోవిడ్-19 పరమైన కారణాల దృష్ట్యా వారందరినీ స్టూడియోలోకి అనుమతించలేదు. స్టూడియో బయటినుంచే 'అప్పు అమర్‌రహే' అంటూ అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
పునీత్ భౌతికకాయానికి సిఎం బసవరాజ్ బొమ్మై సెల్యూట్ చేశారు. అనంతరం భౌతికకాయానికి కప్పిన జాతీయ జెండాను పునీత్ భార్య అశ్వినికి అందజేశారు. అంతకుముందు రాష్ట్ర పోలీసులు 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. అంత్యక్రియల సమయంలో పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు ధృతి, వందిత ఒకరికొకరు పట్టుకొని రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. పునీత్ సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ గుండెలు పగిలేలా రోదిస్తూ, ఉండిపోయారు. అంత్యక్రియలకు మాజీ సిఎం యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షులు డికె.శివకుమార్, నటులు యశ్, సుదీప్ తదితరులు హాజరయ్యారు.