Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
- వరుసగా ఐదో రోజూ బాదుడే..!
- లీటర్ పెట్రోల్, డీజీల్ల పై 35 పైసల చొప్పున పెంపు
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఆదివారం చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ ఇంధన ధరలు పైకి ఎగబాకాయి. ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 35 పైసల చొప్పున ధరలను పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధన ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 109.34కి, డీజీల్ ధర రూ. 98.07కి ఎగబాకింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.15కి, డీజీల్ ధర రూ. 106.23కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.79గా నమోదు కాగా, డీజీల్ ధర రూ. 101.19కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 106.04ను, డీజీల్ ధర రూ. 102.25ని తాకింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.15కి, డీజీల్ ధర రూ. 104.09కి ఎగబాకింది. ఇటు హైదరాబాద్‌లో నూ వాహనదారులకు ఇంధన ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 113.72కి పెరిగింది. అలాగే, లీటర్ డీజీల్ ధర రూ. 106.98కి ఎగబాకింది. ఇక రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 121.62గా నమోదైంది. ఇక్కడ లీటర్ డీజీల్ రూ. 112.52కి ఎగబాకింది.