Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా, సీఐటీయూ, సీపీఐ(ఎం) సంతాపం
న్యూఢిల్లీ : ఐద్వా ప్రముఖ వ్యవస్థాపక నాయకురాలు ప్రమీలా పాంథే (94) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె అక్టోబర్ 31 (ఆదివారం) తుదిశ్వాస విడిచారు. ప్రమీలా పాంథే మత దేశాన్ని ఢిల్లీలోని పండిట్ రవి శంకర్ శుక్లా మార్గ్‌లోని క్యానింగ్ లైన్ 36లో ఐద్వా ఢిల్లీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం ఉదయం తీసుకొచ్చారు. అక్కడ అన్ని ప్రజా సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు ఆమెకు నివాళులర్పించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, నిలోత్పల్ బసు, సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమలత, తపన్ సేన్, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మొమునా మొల్లా, ఆశా శర్మ, ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ''ప్రమీలా పాంథ్కు రెడ్ సెల్యూట్! ప్రమీలా అమర్ రహే!'' అంటూ ఐద్వా, ఇతర ప్రజా సంఘాల కార్యర్తలు నినాదాలు చేశారు.
ప్రమీల పాంథే 1927 నవంబర్ 26న మహారాష్ట్రలోని భుసావల్‌లో జన్మించారు. ఆమె ఇతర పిల్లలతో కలిసి చిన్ననాటి నుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1937లో మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1942లో భారత్ చోడో ఆందోళన సందర్భంగా అరెస్టయి జైలు జీవితం గడిపారు.
ప్రమీలా 1946లో పూణేలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరారు. ఆమె అన్ని రాజకీయ ప్రచారాల్లో పాల్గొనేవారు. ఆమె పార్టీ పత్రికలు పీపుల్స్ వార్, తరువాత పీపుల్స్ ఏజ్‌ని అమ్మేవారు. పార్టీ కాగితాలను లాక్కొని తగలబెట్టే కాంగ్రెస్ గూండాల వేధింపులను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ప్రమీలా 1948లో పార్టీ సభ్యురాలయ్యారు. పార్టీని నిషేధించడంతో పార్టీ పనులు బహిరంగంగా చేయలేకపోయారు. 1949లో ఎరవాడ జైలులో ఉన్న తన బావను కలవడానికి ప్రమీలా మొదటి సారి వెళ్లినప్పుడు, అక్కడ ప్రముఖ మహిళా నాయకులైన అహల్య రంగేకర్, కుసుమ్ రణదివే, గోదావరి పరులేకర్లతో పాటు ఇతరులతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ప్రమీలా భర్త 1957లో మరణించారు. సేవా సదన్‌లో చేరిన తరువాత ఆమె 1957లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె సీపీఐ(ఎం) నేత, కార్మికోద్యమ నేత ఎం.కె పాంథేను వివాహం చేసుకున్నారు.
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ పాంథే : ఐద్వా, సీఐటీయూ, సీపీఐ(ఎం) సంతాపం
ప్రమీలా పాంథే మరణానికి ఐద్వా, సీఐటీయూ, సీపీఐ(ఎం) సంతాపం ప్రకటించాయి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) పునాది వేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పేర్కొన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. పేదలు, మహిళల విముక్తి కోసం తన జీవితమంతా అంకితం చేసిన మహిళా ఉద్యమం తన స్టెర్లింగ్ నాయకుల్లో ఒకరిని కోల్పోయిందని అన్నారు.
మహిళా ఉద్యమ మార్గదర్శకుల్లో ఒకరైన ప్రమీలా పాండేకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) నివాళులర్పించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రకటన విడుదల చేశారు. ఆమె ట్రేడ్ యూనియన్ ఉద్యమ మార్గదర్శకుల్లో ఒకరైన సీఐటీయూ మాజీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎం.కె పాంథే జీవిత భాగస్వామి అని పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో పాటు మహిళా ఉద్యమానికి ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. ప్రమీలా పాంథే మరణానికి సీపీఐ(ఎం) ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆమె మరణానికి సీపీఐ(ఎం) నివాళులర్పించింది. ఆమె మనవరాలు సోనాలి, రూపాలి, ఇతర కుటుంబ సభ్యులకు సీపీఐ(ఎం) ప్రగాఢ సానుభూతి తెలిపింది.