Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48 జిల్లాల్లో మొదటి డోసు కవరేజీ 50 శాతం కంటే తక్కువే..!
- రేపు ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ : దేశంలో వంద కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేశామని కేంద్రం వెల్లడిస్తున్నది. ఈ విషయంపై కేంద్ర మంత్రుల నుంచి కిందిస్థాయి బీజేపీ నాయకుల వరకు బహిరంగ వేదికల్లో, సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేశారు. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం వ్యాక్సినేషన్లో ఇప్పటికీ వెనకబడే ఉన్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన 48 జిల్లాల్లో మొదటి డోసు కవరేజీ 50 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కాగా, ఈ 48 జిల్లాలతో పాటు దేశంలో తక్కువ వ్యాక్సిన్ కవరేజీని నమోదు చేస్తున్న జిల్లాల విషయంలో ప్రధాని మోడీ రేపు (బుధవారం) విస్తృతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కవరేజీ తక్కువగా ఉన్న ఈ 48 జిల్లాల్లో 27 ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (9 కేసులు), మహారాష్ట్ర (6), ఢిల్లీ(1) లు ఉన్నాయి. ఇక దేశంలో నిర్దేశిత సమయంలోగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ను తీసుకోనివారి సంఖ్య దేశవ్యాప్తంగా 10.34 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సెకండ్ డోసును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్-19 మొదటి డోసుకు అర్హులైనవారందరినీ ఈ ఏడాది నవంబర్ ముగింపు నాటికి కవర్ చేయాలని కోరారు.
రెండో డోసు ఆందోళనకరం
దేశంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఆందోళనకరంగా ఉన్నది. సెకండ్ డోస్ కవరేజీ జాతీయ సగటు 31 శాతంగా ఉన్నది. అయితే, ఈ విషయంలో మహారాష్ట్ర (34 శాతం), యూపీ (22శాతం), బీహార్ (25 శాతం), పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఇక గుజరాత్ (55శాతం), కర్నాటక (48శాతం), రాజస్థాన్ (38 శాతం), మధ్యప్రదేశ్ (38 శాతం) రాష్ట్రాలు జాతీయ సగటుతో పోల్చితే పర్వాలేదనిపించినా వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాల్సినవసరం ఉన్నదని ఆరోగ్య నిపుణులు సూచించారు.
కాగా, ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 1.03 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు వ్యాక్సిన్ను తీసుకున్నారు. రెండు డోసులూ (పూర్తి వ్యాక్సినేషన్) వ్యాక్సిన్ను పొందినవారు 92.21 లక్షల మందిగా ఉన్నారు. ఇక ఫ్రంట్లైన్ వర్కర్స్లో మొదటి డోసును పొందినవారి సంఖ్య 1.83గా ఉండగా, రెండు డోసులూ పొందినవారు 1.59 కోట్ల మందిగా ఉన్నారు. ఇక 60 ఏండ్లు పైబడిన వారిలో 10.96 కోట్ల మంది మొదటి డోసును పొందారు. రెండు డోసులూ అందినవారి సంఖ్య 6.66 కోట్లుగా ఉన్నదని అధికారిక సమాచారం. ఇక 45 ఏండ్లు పైబడివారిలో ఫస్ట్ డోస్ పొందినవారు 17.47 కోట్లు, సెకండ్ డోస్ అందినవారు 9.62 కోట్లుగా ఉన్నారు.