Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలు రద్దు చేయాలి.. లేకుంటే పతాక స్థాయికి ఉద్యమం
- 27 నుంచి గ్రామాల నుంచి వేలాది ట్రాక్టర్లు ప్రదర్శన
- కేంద్రానికి రైతునేత రాకేష్ తికాయత్ అల్టిమేటం
- ప్రధాని ఇంటికే కవాతు :గుర్నామ్ సింగ్
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి రైతు సంఘాలు సమయమిచ్చాయి. తామిచ్చిన పరిధి లోపు రద్దు చేయకపోతే ప్రస్తుతం కొనసా గుతోన్న ఆందోళనను మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తైందనీ, అయినా కేంద్రం ఈ విషయాన్ని తేల్చకుండా తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. '''చర్చలు జరిపాం. ప్రతిపాదనలు చేశాం. అయినా ప్రభుత్వం సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవడం లేదు. మేం కేంద్ర ప్రభుత్వానికి 26 వరకు గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా మూడు నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటే సరే. లేదంటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాం. గతంలో కూడా అనేక సార్లు కేంద్రానికి అవకాశం ఇచ్చాం. కానీ మా ప్రతిపాదనలు ఏవీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ మెడలు వంచే వరకు మా పోరాటం ఆగదు'' అని హెచ్చరించారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఈనెల 26వ తేదీలోగా రద్దు చేయాలనీ, లేకుంటే 27వ తేదీ నుంచి రైతుల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 27 నుంచి గ్రామాల నుంచి వేలాది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన జరుపుతున్న ప్రాంతాలకు చేరుకుంటారనీ, అక్కడ వేసుకున్న టెంట్లను కట్టుదిట్టం చేస్తారని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను గల్లా మండి(ధాన్యం మార్కెట్)గా మారుస్తారని హెచ్చరించారు. నిరసన స్థలంలో తమ గుడారాలను కూల్చివేయడానికి పరిపాలనా అధికారులు ప్రయత్నిస్తే, రైతులు వాటిని పోలీసు స్టేషన్లు, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తారని తికాయత్ స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ ఇంటికే ః గుర్నామ్ సింగ్ చదుని
రైతులను బలవంతంగా నిరసన వేదికల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే, ప్రధాని మోడీ నివాసానికి కవాతు నిర్వహిస్తామని బీకేయూ సీనియర్ నేత గుర్నామ్ సింగ్ చదుని స్పష్టం చేశారు. ''గత చాలా రోజులుగా ప్రభుత్వం సరిహద్దులను తెరవడానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల నుంచి బారికేడ్లను తొలగించడం వల్ల నిరసన చేస్తున్న రైతుల్లో భయాందోళనలు చెలరేగాయి. దీపావళి లోపు ప్రభుత్వం రోడ్లను క్లియర్ చేస్తుందని చర్చలు జరుగుతున్నాయి. తప్పు చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం'' అని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని అన్ని ధర్నా వేదికల వద్ద తమ సంఖ్యను పెంచాలని రైతులను కోరారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.''ప్రభుత్వం రోడ్లను తెరవడానికి ప్రయత్నిస్తే, ఈసారి దీపావళిని మోడీ తలుపు వద్ద జరుపుకుంటారు. మేము అక్కడ విడిది చేస్తాం. మేం శాంతియుతంగా (సరిహద్దుల వద్ద) కూర్చున్నాం. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టాలని, బలవంతంగా తొలగించాలని ప్రయత్నిస్తే దేశంలోని రైతులు ఢిల్లీకి తరలివెళ్తారు'' అని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రి, ఘాజిపూర్లో రైతులు నిరసన ప్రారంభించి ఈనెల 26వ తేదీకి సరిగ్గా ఏడాది కానున్నదని తెలిపారు.
యూపీలో కిసాన్ మహా పంచాయత్
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోరు జిల్లాలోని శాండిలాలో కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈ మహా పంచాయత్‌లో పలువురు ఎస్కేఎం నాయకులు పాల్గొన్నారు. హర్యానాలోని భివానీలో హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జెపి దలాల్, ఎంపీ ధరమ్వీర్ సింగ్, ఎమ్మెల్యే ఘన్‌శ్యాం సరాఫ్లకు రైతుల సెగ తగిలింది. రైతులు నల్లజెండాలతో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా రైతులు పాల్గొన్నారు. పోలీసులు బారికేడ్ల వద్ద బైటాయించి, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లేవనెత్తారు. పంజాబ్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు జరుగుతున్నాయి. షహీద్ కిసాన్ అస్థి కలష్ యాత్రలు వివిధ ప్రదేశాలలో జరుగుతున్నాయి. లఖింపూర్ ఖేరీ నుంచి అమరవీరుల అస్థికలను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌తో పాటు కర్నాటకలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. దేశంలో వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, ఈ విధంగా ఇంధన ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమాన్య ప్రజలపై విపరీతమైన భారం వేస్తోందని ఎస్కేఎం విమర్శించింది. ధరలు పెరుగుదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని, ధరలను వెంటనే సగానికి తగ్గించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. వందలాది మంది ఆందోళనకారులు ఇప్పటికీ ఆ ప్రాంతంలో క్యాంప్ చేస్తున్నప్పుడు హైవేలలోని అన్ని విస్తీర్ణం కలిపితే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల టిక్రీ సరిహద్దు సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఢకొీనడంతో పంజాబ్‌కు చెందిన ముగ్గురు మహిళ రైతుల మరణంపై రైతునేతలు ఆవేదన వ్యక్తంచేశారు.