Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 71 శాతం కార్మికులకు సకాలంలో అందని వేతనాలు
- కేంద్ర మంత్రిత్వ శాఖ వద్దనే ఆలస్యం : తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : పొలం దున్నినందుకు ట్రాక్టర్‌కు బాడుగ కట్టేందుకు జార్ఖండులోని చోటలాగియా గ్రామానికి చెందిన అశోక్ ముందూరి అనే ఒక రైతు జులైలో రూ.5 వేలు అప్పు చేశాడు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) కింద చేసిన పనికి రావాల్సిన వేతనాలు వస్తే అప్పు తిరిగి కట్టేద్దాం అనుకున్నాడు. అయితే ఆ చెల్లింపుల ఆలస్యం కారణంగా ఒక నెల తర్వాత తన వద్ద ఉన్నవాటిలో ఒక పందిని అమ్మేసి కట్టాల్సిన పరిస్థితి. మరోవైపు ఇదే రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాకు చెందిన ఒక వరి రైతు తన ఆవేదన వెలిబుచ్చాడు. '' జూన్, జులై నెలల్లో ఎంజిఎన్ఆర్ఇజిఎ కింద మా గ్రామంలో ఒక భూమి అభివృద్ధి ప్రాజెక్టులో 23 రోజులు పనిచేశాను. వేతనాలు వచ్చిన వారంలోగా తిరిగి ఇచ్చేద్దామనే ఉద్దేశంతో సొంత అవసరాల నిమిత్తం జులై చివర్లో కొంత డబ్బు ఇతరుల నుంచి అప్పు తీసుకున్నాను. అయితే ఆగస్టు చివరి వరకు కూడా చెల్లింపులు జరగలేదు. దీంతో పందిని అమ్మి అప్పు తీర్చాను'' అని తెలిపారు. దాదాపు రెండు, మూడు నెలల తర్వాత సెప్టెంబర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వేతనాలు పంపింది. ఇది వీరిద్దరి పరిస్థితే కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి హామీ కార్మికుల దుస్థితి కూడా ఇలాగే ఉంది. అసలే కరోనా సంక్షోభంలో ఆర్థికంగా కొంత అండగా ఉంటుందని భావించిన ఎంజిఎన్ఆర్ఇజిఎ కూడా వారికి ఆదుకున్న పరిస్థితి లేదు. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ నెలల మధ్య ఉపాధి హామీ కింద పనిచేసిన కార్మికుల్లో దాదాపు 71 శాతం మంది సకాలంలో వేతనాలు అందుకోలేకపోయారని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. నిబంధనల ప్రకారం ఎంజిఎన్ఆర్ఇజిఎ కింద పనిచేసిన వారికి ప్రతి ప్రాజెక్టు ఫేజ్ ముగిసిన 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కార్మికులకు వేతనాల చెల్లింపు కోరుతూ రాష్ట్ర అధికారులు 8 రోజుల్లోగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఫండ్స్ ట్రాన్సర్ ఆర్డర్స్ (ఎఫ్టిఓ)లను పంపాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తరువాతి ఏడు రోజుల్లో వేతనాలు చెల్లించాలి. అయితే ఈ ప్రక్రియంతా ఆచరణలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
ఆలస్యానికి కేంద్రానికి బాధ్యత
18 లక్షల గ్రామీణ ఉపాధి స్కీమ్ వర్కర్లకు జారీచేసిన ఎఫ్టిఓలపై లిబ్టెక్ ఇండియాకు చెందిన స్వతంత్ర పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. పశ్చిమబెంగాల్‌తో సహా 10రాష్ట్రాల నుంచి సేకరించిన ఎఫ్టిఓల్లో ప్రతి బ్లాక్‌కు 10శాతం ఎంపిక చేసింది. ఈ డేటా అంతా స్కీమ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. రాష్ట్ర అధికారులు దాదాపుగా తమ 8రోజుల డైడ్లైన్కు అనుగుణంగా పనిచేయగా,కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే తన ఏడు రోజుల పీరియడ్‌ను అనేక సార్లు దాటేసింది. 71 శాతం చెల్లింపులు ఏడు రోజుల డైడ్‌లైన్ దాటగా, 44 శాతం 15 రోజులను అధిగమించాయని ఆధ్యయనంలో తేలింది. అధ్యయనానికి సంబంధించిన వివరాలను విద్యావేత్త, బృందంలో ప్రధాన పరిశోధకుడు రాజేంద్రన్ నారాయనణ్ ఆన్లైన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. రాష్ట్రాలు సకాలంలో ఎఫ్‌టిఓలను పంపినప్పటికీ, వేతనాలు చెల్లింపులో ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని మూడింట్ రెండో వంతు కార్మికులకు వేతనాల చెల్లింపులో కనీసం ఎనిమిది రోజుల ఆలస్యం జరిగిందని అధ్యయనం పేర్కొంది. ఈ విధమైన విధమైన బాధిత కార్మికుల సంఖ్య మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బెంగాల్లో సగం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. బెంగాల్లో 45 శాతం వేతన చెల్లింపులు అక్టోబర్ 13 నాటికి పెండింగ్‌లో చూపించాయి.
కుల ఆధారిత విభజనతో ప్రయోజనం శూన్యం
కార్మికులను ఎస్సి, ఎస్టి, ఇతర కులాలు అనే మూడు వర్గాలుగా విభజించి వేర్వేరు చెల్లింపులను నిర్దేశిస్తూ గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి 2న ఒక సర్క్యులర్ జారీ చేసింది. వివరణ లేకుండా అకౌంటెన్సీ అవసరాలను కారణంగా పేర్కొంది. కానీ ఇది డేటాను ప్రాసెస్ చేయడంలో మరియు ఎఫ్‌టిఓలను వేరు చేయడంలో రాష్ట్ర అధికారులకు భారాన్ని పెంచింది. కేటగిరీని బట్టి వేతన చెల్లింపు కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకున్న సమయం మారుతుందని లిబ్టెక్ పేర్కొంది. ఎస్సిలకు 46 శాతం చెల్లింపులు నిర్దేశించిన ఏడు రోజుల వ్యవధిలో పూర్తి కాగా, ఎస్టిలకు 37 శాతం, మిగిలిన వారికి 26 శాతంగా ఉంది. కుల ఆధారిత విభజన ఎటువంటి ప్రయోజనాలకు దారితీయలేదని, బ్లాక్ అధికారుల పనిని మూడు రెట్లు పెంచడంతో పాటు కుల, మత ఘర్షణలను సష్టించిందని రాజేంద్రన్ అన్నారు. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌కు చెందిన సామాజిక కార్యకర్త నిఖిల్దే మాట్లాడుతూ ప్రాజెక్టులను చేపట్టకుండా పంచాయతీలను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా వేతన చెల్లింపును ఆలస్యం చేసిందని అన్నారు.