Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కును కాపాడుకుంటాం...
- స్టీల్ ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తే బీజేపీ అంతుచూస్తాం ..
- కార్పొరేట్ల కోసమే మోడీ ఊడిగం : నాటి ఉద్యమకార్యకర్త డాక్టర్ కొల్లా రాజమోహన్, ఆలిండియా విద్యార్థి సంఘ నేతలు
విశాఖ : పోరాటాల ద్వారానే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అవతరణ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటునూ సాధించుకున్నామనీ... మళ్లీ అదే తరహా పోరాటాలతోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టుకోవాలని... అందుకు రక్తతర్పణానికైనా వెనుకాడబోమని 1966 నాటి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమ కార్యకర్త డాక్టర్ కొల్లా రాజమోహన్ ఉద్ఘాటించారు. ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యాన సోమవారం విశాఖలోని పాత పోస్టాఫీసు వద్ద స్టీల్‌ప్లాంట్ సాధన అమరుల స్మృతి పథం -విద్యార్థి, యువజన సభ నిర్వహించారు. సభకు వందల సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆ ప్రాంగణమంతా మార్మోగేలా నినాదాలు చేశారు. 1966 నవంబరు 1న విశాఖ ఉక్కు సాధనకై జరిగిన ఉద్యమం సందర్భంగా ఇదే పాత పోస్టాఫీసు ప్రాంతంలో పోలీసు కాల్పులకు బలైన 12 మంది అమరులకు స్మృత్యర్థంగా ఇక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారికి జోహార్లు అర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాజమోహన్ మాట్లాడుతూ, మనం ఈ రోజు సభ జరుపుకుంటున్న ప్రాంగణం... 1966 నవంబరు 1న పోలీసుల తూటాలకు బలైన విశాఖ ఉక్కు అమరవీరులతో తడిసిన నేల అన్నారు. ఈ సభకు హాజరైన విద్యార్థులు, యువజనులను చూస్తుంటే 1966 అక్టోబర్ 21న మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారీ ర్యాలీ, సభ గుర్తుకొస్తుందన్నారు. ఆ తర్వాత గోపాలపట్నం రైల్వే స్టేషన్ పట్టాలపై ప్రజలు పడుకుని హౌరా-మద్రాస్ మెయిల్‌ను ఆపేశారన్నారు. స్టీల్ ఇస్తారా? చస్తారా? అని తెలుగు ప్రజలు గర్జించడంతో పరిశ్రమ వచ్చిందన్నారు. అయితే కేంద్రం తొలినుంచీ ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్న చూపు చూస్తూనే వస్తోందన్నారు. విశాఖ ఉక్కు సాధన ఉద్యమం 1966లో ప్రారంభం కాగా 1972 వరకూ పరిశ్రమ స్థాపన ప్రకటన చేయలేదని, 1990 వరకూ ఉత్పత్తిని ప్రారంభించలేదని పేర్కొన్నారు. కార్మికుల శ్రమతో ఉక్కు పరిశ్రమ తయారై నేడు రూ.3.20లక్షల కోట్లు విలువ కలిగి ఉందని, అటువంటి పరిశ్రమలను బీజేపీ రూ.2500కోట్లకు అమ్మకానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అమ్మాలని చూస్తే ..ఊరుకోం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ సిహెచ్.నర్సింగరావు
దేశంలో 5వ స్టీల్పరిశ్రమగా విశాఖలో ఏర్పాటైన విశాఖ ఉక్కు కోసం 55 ఏండ్ల కిందట మహత్తర పోరాటం జరిగిందనీ, ఈ నేపథ్యంలోనే దీన్ని నిలబెట్టుకోడానికి విశాల ప్రజామద్దతు లభిస్తున్నదనీ, దీన్ని అమ్మాలని చూస్తే బీజేపీ తునాతునకలౌతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ సిహెచ్.నర్సింగరావు హెచ్చరించారు. దేశాన్ని అమ్మడమే బీజేపీ దేశభక్తా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రం గాన్ని మోడీ, షా, నిర్మలాసీతారామన్లు సేల్ (అమ్మకాని)కి పెట్టారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేలాగ పోరాటాలను ప్రారంభిస్తామన్నారు.
అమ్మకాలే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం : ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్
దీపావళి బంపర్ ఆఫర్‌లాగా మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని, కార్పొరేట్ల కోసమే బీజేపీ ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆలిండియా ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధికి వెన్నెముకగానూ... దేశానికే గర్వకారణంగా స్టీల్‌ప్లాంట్ నిలుస్తుందన్నారు. మోడీ సర్కారు మేకిన్ ఇండియా జపం చేస్తూ, ఆయన వేసుకునే సూట్ ఇంగ్లండ్ నుంచి కారు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతోన్న మోడీ, షాలు దేశంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు మాత్రం ఇవ్వడం లేదన్నారు.
విశాఖ ఉక్కు జాతీయ సమస్య : ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహాశారి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఈ ప్రాంత సమస్య కాదని, జాతీయ సమస్యగా తాము పోరాడాలని నిర్ణయిం చుకున్నామన్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ వినిపిం చేలా నినాదాలు ఇక్కడ నుంచే బీజేపీకి వినిపించాలన్నారు. విశాఖ ఉక్కులాంటి పరిశ్రమల్లేకపోతే ఉపాధి లభించదని ఆవేదన చెందారు. మరోవైపు కాలేజీల నుంచి విద్యార్థులను తరిమికొట్టేందుకు నూతన విద్యావిధానం బిజెపి తీసుకొచ్చిందని, దీన్ని తిప్పికొడతామని స్పష్టంచేశారు.
మోడీ అమ్మకాల ప్రధాని : డివైఎఫ్ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు
దేశంలో వాజ్‌పేయి తర్వాత అమ్మకాల ప్రధాన మంత్రిగా మోడీకే ఆ ఘనత దక్కుతుందని డివైఎఫ్ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు ఉద్ఘాటించారు. బిజెపి వారసత్వమే దేశాన్ని అమ్మేయడమన్నారు. పంజాబ్ నుంచి భగత్‌సింగ్ వారసులు రైతు చట్టాలపై పోరు ప్రారంభిం చారని, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి అల్లూరి వారసులు స్టీల్ పరిరక్షణ ఉద్యమం చేపట్టారన్నారు.
పీడీఎస్ఓ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆసక్తితో ఏర్పాటు చేసింది కాదని 32 మంది ప్రాణత్యాగం, 67 మంది ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు, ప్రజా పోరాటాల ఫలితంగా వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు తలచుకుంటేనే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందన్నారు. సభలో ప్రసంగించిన వారిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షు లు ప్రసన్నకుమార్, ఏఐడీఎస్ఓ నాయకుడు హరీష్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జాన్సన్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహనరావు, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ఎం.జగ్గునాయుడు, ఎస్ఎఫ్ఐ నాయకులు బి.కుసుమ, ఎల్.చిన్నారి ఉన్నారు. సభకు అధ్యక్ష వర్గంగా ఎల్జె.నాయుడు (ఎస్ఎఫ్ఐ), ఫణీంద్ర (ఎఐఎస్ఎఫ్), ఎస్కె.భాషా (ఎన్‌వైఎస్) వ్యవహరించారు.