Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై దీపావళి ధరల బాంబు
- గ్యాస్(వాణిజ్య) ధర రూ.266 పెంపు
- రెండు వేలు దాటిన కమర్షియల్ సిలిండర్
- గృహావసరాల గ్యాస్ ధర రూ.1,000కి చేరువలో
- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
- మోడీ సర్కార్ నిలువు దోపిడీ
టపాసుల పండుగ చేసుకుందామనుకుంటే..ధరలు మండిపోతున్నాయి. పప్పులు,ఉప్పులు,బెల్లమే కాదు ఏం కొందామన్నా.. ఏం తిందామన్నా జేబులు తడుముకునే పరిస్థితులు. కనీసం దీపావళి పండుగనైనా సంతోషంగా చేసుకోనీయకుండా మోడీ ప్రభుత్వం గ్యాస్, ఇంధనధరలను అమాంతంగా పెంచేసింది. గృహవినియోగగ్యాస్ పై సబ్సిడీ కూడా లేకుండా చేసేసింది. ఏ క్షణ్ణాన్నైనా వెయ్యిరూపాలకు చేరుకోనున్నది. దేశప్రజల సహనాన్ని అలుసుగా తీసుకుంటున్నదనే చర్చ నడుస్తున్నది. అందుకే ఛాన్స్ దొరికితే చాలు ప్రజల్ని ఎలాగైనా బాదేయాలన్న తీరు కేంద్రంలోని బీజేపీ సర్కారులో వ్యక్తమవుతున్నది.
న్యూఢిల్లీ : దేశ ప్రజలకు మోడీ సర్కార్ దీపావళి షాక్ ఇచ్చింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ. 266 పెరగడంతో. .రూ.2 వేల మార్క్‌ను దాటింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,734 నుంచి రూ.2,000.50కి పెరిగింది. పండుగకు ముందు మోడీ ప్రభుత్వం ధరల పెరుగుదల బాంబు మరోసారి పేలింది. పెట్రోల్, డీజిల్ తరువాత కమర్షియల్ సిలిండర్‌పై రూ.266 చొప్పున పెంచారు. వాణిజ్య సిలిండర్ల ధరను అమాంతంగా పెంచేసింది.
చిరు వ్యాపారులకు దెబ్బె...
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్‌ను వినియోగించే చిరువ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు తాజాగా వారు వినియోగించే సిలిండర్లపై ధరల పెరగడం అనేది వారి వ్యాపారాన్ని మరింత దెబ్బతీయడమే ఖాయంగా కనిపిస్తోంది.
ఎప్పుడు బాదుతారో...
గృహావసరాల సిలిండర్లపై కాదు. దేశీయ ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పటికే గృహావసరాల సిలిండర్ల ధరను దశలవారీగా పెంచారు. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,734 నుంచి రూ.2,000.50, ముంబాయిలో1,683 నుంచి రూ.1,950కి పెరిగింది. కోల్‌కతాలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.2,073.50, చెన్నైలో రూ.2,133కి పెరిగింది.
గతనెలలో గృహావసరాల గ్యాస్ ధర రెండు సార్లు పెంపు
గృహ వినియోగం కోసం ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. అక్టోబర్ నెలలోనే రెండు సార్లు డొమెస్టిక్ ఎల్పీజీ వంట గ్యాస్ ధరను పెంచారు. అందుకే ప్రస్తుతం దాని జోలికి వెళ్లలేదు. అయితే ఎప్పుడైనా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబరు 6న సబ్సిడీ గ్యాస్‌తో సహా అన్ని కేటగిరీల ఎల్పీజీ వంట గ్యాస్ ధరలను పెంచారు. ఎల్పీజీ వంట గ్యాస్ ధర రూ.15 పెంచారు. అంతకు ముందు అక్టోబర్ 1న సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్పీజీ వంట గ్యాస్ ధర రూ.25 పెంచారు.జులై నుంచి ఇప్పటి వరకు రూ.90 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ను రూ.899.50కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో 14.2 కేజీల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.926 కాగా చెన్నైలో రూ.915.50 ఉంది. దీనిబట్టీ దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు త్వరలో రూ. 1,000 మార్కును దాటవచ్చని అంచనా. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు జనవరిలో రూ.694 నుంచి ఎనిమిది సార్లు వరుసగా పెంపుదల తరువాత ఇప్పుడు రూ.926కి పెరిగాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం గృహావసరాలకు 14.2 కిలోల 12 సిలిండర్లను సబ్సిడీ ధరలకు పొంద వచ్చు. దానికంటే ఎక్కువ పొందాలంటే మార్కెట్ ధర, నాన్-సబ్సిడీ రేట్లకు కొనుగోలు చేయాలి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్-రూపాయి మారకపు రేటు బట్టీ దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు నిర్ణయం జరుగుతాయి. ఎందుకంటే క్రూడ్ ధరలు యూఎస్ డాలర్లలో సూచించబడతాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దేశంలో మోడీ ప్రభుత్వం విధించిన సెస్ వల్ల ధరలు పెరుగుతున్నాయి.
వరుసగా ఆరో రోజు...
దేశవ్యాప్తంగా ఇంధనధరలు పెరుగుతూనే ఉన్నాయి.వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో లీటర్‌కు 35 పైసల పెంపుతో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.69కి పెరిగింది, డీజిల్ ధర అదే మొత్తంలో రూ.98.42కి పెరిగింది. ముంబయిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.115.50, రూ.106.62కి పెరిగాయి. కోల్‌కతా విషయాని కొస్తే పెట్రోల్ ధర లీటరుకు రూ.110.35, డీజిల్ ధర లీటరుకు రూ.101.56 ఉంది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ లీటరుకు వరుసగా రూ.106.35, రూ.102.59 ఉంది.