Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ముందు కంటే 79 శాతం అధికం
- అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా దేశ ప్రజలపై ఆర్థిక భారం తగ్గలే..
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల పై ఎక్సైజ్ సుంకం పెంచడంతో, కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన ఎక్సైజ్ సుంకం వసుళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 33 శాతం పెరిగాయి. కరోనా ముందుతో పోలిస్తే ఇది 79 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య వసూలైన మొత్తం రూ.1.71 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు పేర్కొంటున్నాయి. 2020-21 ఇదే సమయంలో వసూలైన మొత్తం రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే 33 శాతం అధికం. అదే కరోనా ముందు నాటి 2019-20 ఇదే కాలం వసూళ్లు రూ.95,930 కోట్లుగా ఉన్నాయి. 2019-20లో ఎక్సైజ్ వసూళ్లు రూ.2.39 లక్షల కోట్లు కాగా, 2020-21లో రూ.3.89 లక్షల కోట్లకు చేరాయి. మిగిలిన ఉత్పత్తులు, సేవలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూలు చేస్తున్నా, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్), సహజవాయువుపై మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత సంవత్సరం మొత్తంమీద ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపేణా మరో రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
నాలుగు రెట్లు అధికం..
ఇదిలావుండగా, గత యూపీఏ ప్రభుత్వం ఇంధనాన్ని సబ్సిడీపై అందించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు అప్పుడు బాండ్లు జారీ చేశారు. వాటికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాలి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లోనే అదనంగా రూ.42,931 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. అంటే ఆయా కంపెనీలకు చెల్లించాల్సిన దాంతో పోలిస్తే 4 రెట్ల కంటే ఎక్కువ ఖజానాకు సమకూరింది.
పెరిగిన పన్నుపోటుతో..
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గతేడాది గణనీయంగా క్షీణించినా, దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గలేదు. అప్పుడు లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.19.98 నుంచి రూ.32.90కు, డీజిల్‌పై సుంకాన్ని రూ.31.80కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం ముడిచమురు బ్యారల్ ధర 85 డాలర్లకు క్షీణించింది. అయితే, దేశీయంగా లీటర్ పెట్రోల్ ధరలు రూ.120కు చేరినా ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం తగ్గించకపోగా, ప్రభుత్వం వినియోగదారులపై పన్నుభారం పెంచుతూనే ఉంది.