Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకీర్ణ కూటమి నేతలపై 'ఐటీ' ప్రయోగం
- తాజాగా అజిత్‌పవార్ ఆస్తులు జప్తు
పూణే : తాము అధికారంలో లేని లేదా అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి అక్రమంగా పాగా వేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్రలకు పాల్పడుతోంది. ఇందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమంగా వినియోగించుకుంటూ దాడులు, సోదాలతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోంది. అలాచేస్తే వారు తమ పంచన చేరుతారని, అది తమకు లాభిస్తుందనేది బిజెపి నేతల లెక్క. ఇదే విధమైన గారడీని బిజెపి ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రయోగించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్ పవార్‌కు సంబంధించిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను (ఐటి ) శాఖ ప్రాథమికంగా జప్తు చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పవార్ బంధువులు, సన్నిహితులకు చెందిన వ్యాపారాలు, ఆస్తులపై గతనెలలో దాడులు నిర్వహించిన ఐటి అధికారులు తాజా చర్యలు తీసుకున్నారు. బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం-1988 ప్రకారం ఆస్తుల జప్తు జరిగిందని ఐటి వర్గాలు వెల్లడించాయి. జప్తు అయిన ఆస్తుల జాబితాలో చక్కెర ఫ్యాక్టరీ, దక్షిణ ఢిల్లీలోని ఒక నివాసం, ముంబయిలోని నారిమన్ పాయింట్లో గల నిర్మల్ టవర్, గోవాలోని ఒక రిసార్టుతో పలు భూములు ఉన్నట్లు సమాచారం. గతనెలలో ఐటి అధికారులు చక్కెర కర్మాగారాలతో పాటు పలు వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఇదే సమయంలో కొల్హాపూర్, పూణేలోని పవార్ సోదరీమణులకు చెందిన నివాసాలతో పాటు కుమారుడు పార్థ్ పవార్‌కి చెందిన ముంబయిలోని కార్యాలయంలో సోదాలు చేశారు. దాడుల సమయంలో అజిత్ పవార్ స్పందిస్తూ.. తనకు చెందిన సంస్థలన్నీ పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నాయని చెప్పారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై ఈ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు.
అనిల్ దేశ్‌ముఖ్‌కు రిమాండ్
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్‌సిపి నేత అనిల్‌దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు ఈనెల 6 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీ విధించింది. అనిల్‌దేశ్‌ముఖ్ అధికార దుర్వినియోగంతో పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న సచిన్ వాజే ద్వారా ముంబయిలోని బార్లు, రెస్లారెంట్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఇడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం దాదాపు 12 గంటలపైగా ప్రశ్నించిన ఇడి రాత్రి సమయంలో దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసింది.