Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదాసీన వైఖరిపై ఏఐకేఎస్ ఆగ్రహం
- తగినన్ని ఎరువులు అందుబాటులో ఉంచాలి
- దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులు ఒకవైపు తీవ్రమైన ఎరువుల కొరత సమస్య ఎదుర్కొంటుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ చోద్యం చూస్తోందని ఏఐకేఎస్ విమర్శించింది. సమస్యకు పరిష్కారం చూపకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని రైతులకు పంట అవసరాలకు అనుగుణంగా తగినన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలనీ, అందుకు తక్షణం ప్రభుత్వ రంగ కంపెనీల ద్వారా తగిన మోతాదులో దిగుమతులు చేసుకోవాలని ఏఐకేఎస్ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఇటువంటి సమస్య మరెప్పుడూ ఉత్పన్నం కాకుండా దేశంలో ఎరువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. అదేవిధంగా ఎన్బీఎస్ పథకం కింద ఎరువులుపై ధరల నియంత్రణను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేసింది. దేశంలో వ్యవసాయ రంగం, ఆహార భద్రతపై కోవిడ్-19 మహమ్మారి చూపిన ప్రభావాన్ని మోడీ ప్రభుత్వం తక్కువగా చూపుతోందని ఏఐకేఎస్ ఈ సందర్భంగా పేర్కొంది. ఎరువుల కొరతపై దృష్టి పెట్టకుండా.. ఆ వార్తలు ఒట్టి పుకార్లంటూ కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ పేర్కొనడం సరికాదని పేర్కొంది. అలాగే ఎరువులను నిల్వ చేయొద్దంటూ రైతులపై నిందలు వేసే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొంది.
ప్రభుత్వ ప్లాంట్ల నిర్వీర్యం
గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం, ఎరువుల తయారీలో దేశీయ సామర్థ్యాన్ని నిరంతరం తగ్గించడంతో ఎరువుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఏఐకేఎస్ పేర్కొంది. ప్రభుత్వ రంగ ఫెర్టిలైజర్ ప్లాంట్లను ప్రభుత్వాలు ఒక క్రమబద్ధంగా నిర్వీర్యం చేశాయనీ, అంతర్జాతీయంగా నెలకొన్న విపరీతమైన ధరలను తగ్గించేందుకు యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపలేదని విమర్శించింది. దేశ ఆహార భద్రతకు ఎరువుల సరఫరా కీలకం. కోవిడ్-19 ప్రభావంతో పాటు బెలారస్‌పై ఈయూ, అమెరికా వంటి దేశాల ఆంక్షలు, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేలా ముందస్తు చర్య తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని పేర్కొంది. ఈ ఏడాది మొదట్లో ఎరువుల ధరలు పెరుగుదల ప్రారంభమైన సమయంలో ముడిపదార్థాలు, ఫెర్టిలైజర్లు సరిఫడా నిల్వ ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోకుండా.. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని భరించేందుకు కంపెనీలకు రాయితీలు ఇచ్చిందని తెలిపింది.
ఎరువుల కొరత ఇలా..
ఉత్పత్తి, దిగుమతులతో కలుపుకొని ఈ ఏడాది మార్చి-సెప్టెంబర్ మధ్య డిఎపి సరఫరా గతేడాది ఇదే రబీ సీజన్‌తో పోల్చుకుంటే 31 శాతం తక్కువగా ఉంది. అదేవిధంగా పొటాష్ సరఫరా కూడా 68 శాతం తగ్గింది. అక్టోబర్ 31 నాటికి డిఎపి నిల్వలు 14.63 లక్షల టన్నులు ఉండగా, 2019, 2020లలో వరుసగా 64 లక్షలు, 44.95 లక్షల టన్నులు ఉన్నాయని.. ఇది దేశంలో ఎరువుల కొరతకు అద్దం పడుతోందని ఎఐకెఎస్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ ఏడాది 7.82 లక్షల టన్నుల మేర మాత్రమే మురియేట్ పొటాష్ (ఎంఓపీ) నిల్వలు అందుబాటులో ఉండగా, గత రెండేళ్లలో 21.52 లక్షలు , 21.7 లక్షల చొప్పున ఉందని తెలిపింది.
యూపీలో ఐదుగురు రైతుల మృతి
నియంత్రణ లేని విధానాల కారణంగా ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ భారీయెత్తున జరుగుతోందని పేర్కొంది. మరోవైపు రైతులు రోజుల తరబడి క్యూల్లో నిలుచున్నా కూడా ఎరువులు దక్కని పరిస్థితి నెలకొందని, ఈ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ రీజియన్‌లో ఐదుగురు రైతులు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఏఐకేఎస్ విచారం వ్యక్తం చేసింది. అప్పులు చేసి డబ్బులు తెచ్చుకున్నా ఎరువులు దక్కకపోవడంతో యూపీ, మధ్యప్రదేశ్‌లలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. ఎరువుల కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోకుంటే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువుల అదనపు సరఫరాలను తక్షణం పొందేందుకు తగిన అవకాశాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఎఐకెస్ డిమాండ్ చేసింది.