Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
- హిమాచల్‌లో లోక్‌సభ స్థానంలో ఓటమి
- 3 అసెంబ్లీ స్థానాల్లోనూ పరాజయం
- బెంగాల్లోనూ ఓటమి, భారీగా తగ్గిన ఓట్లు
- మూడు చోట్ల డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ
- కర్నాటక సీఎం ఇలాకాలో ఓటమి
- హర్యానాలో కమలంపార్టీకి షాక్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, హర్యానాలో ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భంగపాటు తప్పలేదు. అలాగే పశ్చిమ బెంగాల్లో రెండు సిట్టింగ్ స్థానాల్లో ఓటమి పాలుకాగా, భారీగా ఓట్లను కోల్పోయింది. అంతేకాక మూడు చోట్ల డిపాజిట్లను కోల్పో యింది. దీంతో తృణమూల్ ఎమ్మెల్యేల సంఖ్య 217కి చేరింది. బీజేపీ 77 సీట్ల నుంచి 75స్థానాలకు దిగజారింది. కర్నాట కలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సొంత జిల్లా హవేరి జిల్లా ఆనగల్ నియోజకవర్గంలో బీజేపీ పరాజయం పాలైంది. హర్యానాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. రాజస్థాన్‌లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా మూడు లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, వంటి రాష్ట్రాల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ సిట్టింగ్ స్థానాలైన మండీ లోక్‌సభ, జుబ్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా పరాజయం చవిచూసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మండీ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి 4,05,459 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో బీజేపీ అభ్యర్థి ఓటమి చెందారు. అలాగే జుబ్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ (29,447) చేతిలో బీజేపీ (2,644 ఓట్లు) ఘోరంగా ఓటమి చవి చూసింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆ స్థానం... ఈసారి మూడో స్థానంలో పడిపోయింది.
23,344 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. తన సిట్టింగ్ స్థానాలైన ఆర్కి, ఫతేపూర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి ఘోరపరాభవం ఎదురయ్యాక..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ..ద్రవ్యోల్బణమే బీజేపీ ఓటమికి కారణమ న్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నదృష్ట్యా... ఇప్పటికే పలువురు సీఎంలను మార్చిన బీజేపీ అధిష్టానం ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కర్నాటక సీఎంకు షాక్
కర్నాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా,అందులో బీజేపీ, కాంగ్రెస్‌లో చెరొకటి గెలుచుకున్నాయి. అయితే సీఎం బసవరాజు బొమ్మై సొంత జిల్లా హవేరి జిల్లా ఆనగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమి పాలైంది. జేడీఎస్సిట్టింగ్ స్థానమైనసింద్గిలో బీజేపీ గెలిచింది.
రాజస్థాన్‌లోనూ బీజేపీకి చుక్కెదురు
రాజస్థాన్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండిం టిని కాంగ్రెస్ కైవశం చేసుకుంది. అందులో బీజేపీ సిట్టింగ్ ధరివాడ్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 23,332ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
పశ్చిమబెంగాల్లోనూ కమలంపార్టీకి పరాభవం
పశ్చిమ బెంగాల్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. అలాగే భారీగా ఓట్లను కోల్పోయింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగిన ఎన్నికల్లో దిన్హత అసెంబ్లీ స్థానంలో బీజేపీకి 1,16,035 ఓట్లు రాగా, ఈసారి కేవలం 25,486 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 90,549 ఓట్లను కోల్పోయింది. గోసబా స్థానంలో అప్పుడు 82,014 ఓట్లు రాగా, ఈసారి కేవలం 18,423 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 63,591 ఓట్లను కోల్పోయింది. ఖర్దహా నియోజకవర్గంలో అప్పుడు 61,665 ఓట్లు రాగా, ఇప్పుడు 20,254 ఓట్లు వచ్చాయి.
అంటే 41,411 ఓట్లును కోల్పోయింది. శాంతిపూర్ స్థానంలో అప్పుడు 1,09,722 ఓట్లు రాగా, ఇప్పుడు 47,167 ఓట్లు వచ్చాయి. అంటే 62,555 ఓట్లు కోల్పోయింది. ఈ నాలుగు స్థానాల్లో టీఎంసీ గెలిచింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండింటిలో బీజేపీ, ఒకదానిలో కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలో ఒక స్థానానికి ఎన్నిక జరగగా, దాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. బీహార్‌లో రెండు స్థానాల్లో అధికార జేడీయూ గెలిచింది. అసోంలో ఐదు స్థానాలకు గానూ, మూడింటిని అధికార బీజేపీ, రెండింటిని బీజేపీ భాగస్వామ్య పార్టీ యూపీపీఎల్ గెలుచుకున్నాయి. మేఘాలయాలో మూడు స్థానాలకు గానూ, రెండింటిని ఎన్పీపీ, ఒకదాన్ని యూడీపీ సొంతం చేసుకున్నాయి. మిజోరంలో ఒక స్థానానికి ఎన్నిక జరగగా, దాన్ని మిజో నేషనల్ ఫ్రంట్ సొంతం చేసుకుంది. నాగాలాండ్‌లో ఒకస్థానానికిగానూ ఎన్డీపీపీ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ నియోజకవర్గంలో అధికార వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, తెలంగాణలో బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఈటల రాజేందర్ గెలిచారు. మొత్తంగా బీజేపీ ఏడు స్థానాల్లో, కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలిచింది. మిగత 15 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచాయి.
లోక్‌సభ స్థానాల్లో భారీగా ఓట్లు కోల్పోయిన బీజేపీ
దాద్రానగర్ హావేలీ, డామన్ డయ్యూ లోక్‌సభ స్థానాన్ని శివసేన సొంతం చేసుకుంది. ఈ స్థానంలో బీజేపీ దాదాపు 20 వేల ఓట్లను కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా లోక్‌సభ స్థానాన్ని బీజేపీ తిరిగి సొంతం చేసుకున్నా.. భారీగా ఓట్లను కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖాండ్వా స్థానంలో బీజేపీకి 8,38,909 ఓట్లు రాగా, ఇప్పుడు 6,32,455 ఓట్లు వచ్చాయి. అంటే 2,06,454 ఓట్లను బీజేపీ కోల్పోయింది.
శాంతిపూర్‌లో పుంజుకున్న సీపీఐ(ఎం)
శాంతిపూర్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) 39,958 ఓట్లు సొంతం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 9,848 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేసింది. అయినప్పటికీ 19.57 శాతం ఓట్లు సీపీఐ(ఎం) సంపాదించుకుంది.
రైతుల విజయం..
హర్యానాలో రైతులకు మద్దతుగా రాజీనామా చేసిన ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యే అభరు చౌతాలా, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇది రైతుల విజయం. నల్ల చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం కొనసాగిస్తా.
- అభయ్ చౌతాలా
బీజేపీకి ఓటరు శిక్ష : ఎస్కేఎం
రైతు వ్యతిరేక బీజేపీకి ఉప ఎన్నికల్లో ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పారనిసంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొన్నది. రైతు ఉద్యమాన్ని అన్ని విధాలా అణచివేసేందుకు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారనీ, ఆ పార్టీ నేతలు పాల్గొనే సభలు, సమావేశాల వద్ద తమదైన శైలిలో నిరసనలు, ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిచ్చింది.