Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్ ఉత్తర్వులు ఆలస్యంపై సుప్రీం న్యాయమూర్తి డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : న్యాయస్థానాలు ఇచ్చే బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు చేరటంలో ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలో నెలకొన్న ఈ సమస్య వెంటనే సరిదిద్దాలని లేదంటే అండర్ ట్రైల్ ఖైదీల హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోందని ఆయన అన్నారు. బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు చేరటంలో ఆలస్యం కావటం వల్ల అతడు జైల్లో రెండు రాత్రులు గడపాల్సి వచ్చింది. వర్చువల్ కోర్టులు, ఈ-సేవా కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందజేయటంలో ఇప్పుడు నెలకొన్న వ్యవస్థ మారాలని అభిప్రాయపడ్డారు.
''ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవతో అక్కడ 'ఈ-కస్టడీ సర్టిఫికెట్' తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఖైదీకి ఇది ట్యాగ్ చేస్తారు. ఖైదీకి సంబంధించి అన్ని వివరాలూ సర్టిఫికెట్లో ఉంటాయి. బెయిల్ ఉత్తర్వులు కూడా ఇదే విధంగా అందజేస్తే బాగుంటుంది'' అని అన్నారు. సుప్రీంకోర్టు ఈ-కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్ డి.వై.చంద్రచూడ్, గుజరాత్, కర్నాటక హైకోర్టుల్లో న్యాయ విచారణ ప్రత్యక్ష ప్రసారాలు ప్రభావంతంగా ఉన్నాయని, త్వరలో అలహాబాద్ హైకోర్టులోనూ ఇది రావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల్ని అందించడానికి మరిన్ని ఈ-సేవా కేంద్రాలు ఏర్పాటుచేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు.