Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విచారించనున్న సుప్రీం
న్యూఢిల్లీ : వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి విద్యా రంగం వస్తుందా రాదా అనేది పరిశీలించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఇదే రకమైన లీగల్ అంశం మరో కేసు పరిధిలో పెండింగ్లో వున్నందున, దానితో పాటు దీన్ని విచారిస్తామని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన బెంచ్ పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్టం-1986 పరిధిలోకి విద్యా సంస్థలు రావని పేర్కొంటున్న జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సిఆర్డిసి) ఉత్తర్వులను లక్నో నివాసి సవాలు చేశారు. ఆ పిటిషన్ను సుప్రీం కోర్టు విచారిస్తోంది. ఈత వంటి సహ పాఠ్య కార్యకలాపాలతో కూడిన విద్య అనేది వినియోగదారుల రక్షణ చట్టంలో పేర్కొంటున్న 'సేవ' కిందకు రాదని ఆ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. పిటిషన్ దాఖలు చేసిన లక్నో నివాసి కుమారుడు తాను చదువుకుంటున్న స్కూలు నిర్వహించిన వేసవి శిబిరానికి వెయ్యి రూపాయిలు చెల్లించి హాజరయ్యాడు. 2007 మే 28న స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ పిల్లవాడు చనిపోయాడు. దాంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించినందువల్లే తన కుమారుడు చనిపోయాడంటూ ఆ తండ్రి రాష్ట్ర కమిషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణానికి నష్టపరిహారంగా రూ.20లక్షలు, తన మానసిక వేదనకు రూ.2లక్షలు, కోర్టు ఖర్చుల కింద రూ.55వేలు చెల్లించాలంటూ డిమాండ్చేశారు. ఫిర్యాదీదారు వినియోగదారుడు కింద రాడంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆ ఫిర్యాదును తోసిపుచ్చింది. దాంతో జాతీయ కమిషన్లో దాన్ని సవాలు చేశారు. అయితే స్విమ్మింగ్ వంటి సహ పాఠ్యాంశాలతో కూడిన విద్య అనేది వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి రాదని జాతీయ కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించింది.