Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చదువుకోవాలన్న తపనకు రవాణా సౌకర్యం లేక అడ్డు పడతున్నదంటూ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణకు రంగారెడ్డి జిల్లా చిదే డుకు చెందిన పి.వైష్ణవి లేఖ రాసింది. తాను, సోదరుడు, సోదరి సహా అనేక మంది విద్యార్థులు గ్రామం నుంచి సూదూర ప్రాంతాల్లోని పాఠ శాలలు, కళాశాలలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణకు సెప్టెంబర్ 19న లేఖ రాసింది. ఆటో ఖర్చులు ఆర్థిక భారమవుతున్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ.. తెలంగాణ ఆర్టీసి ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సీజేఐకు కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్.. ఆ మార్గంలో బస్సు సౌకర్యం పునరుద్ధరిస్తామని బుధవారం ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
బాలిక రాసిన లేఖ సారాంశం
''గౌరవనీయులైన జస్టిస్ ఎన్వి రమణకు నమస్కరించి రాయు నది ఏమనగా, నా పేరు పి.వైష్ణవి (13) ఎనిమిదో తరగతి చదువు తున్నా. నా సోదరుడు పి.ప్రణీత్(14) 9వ తరగతి 6 కిలో మీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం. సోదరి పి.ప్రీతి (15) 18 కిలోమీటర్ల దూరంలోని కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కరోనా మొదటి నుంచి మా గ్రామానికి బస్సు రావడం లేదు. దీనివల్ల మాతోపాటు స్నేహితులూ చాలా ఇబ్బందిపడుతున్నాం. పాఠశాల, కళాశాలకు వెళ్లడానికి ఆటో చార్జీలు రూ.150 అవుతున్నాయి. మా నాన్న కరోనా మొదటి దశలో గుండెనొప్పితో కన్నుమూశారు. చిన్న ఉద్యోగం చేసి అమ్మ మమ్మల్ని పోషిస్తోంది. ప్రభుత్వ బస్సులు తిరిగి ప్రారంభం చేయడానికి సహాయం చేయగలరని మనవి'' అని వైష్ణవి లేఖలో పేర్కొంది. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సూచన మేరకు వైష్ణవి లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐ ప్రయివేటు కార్యదర్శి ఎస్కె రఖేజా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్‌కు ఈనెల 2న లేఖ రాశారు. తక్షణమే స్పందించిన సజ్జనార్ బుధవారం ట్విటర్ వేదికగా చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం పనురుద్ధరిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టాన్ని గౌరవిస్తూ పాఠశాలలకు సమయానికి బస్సులు నడుపుతామని సజ్జనార్ హామీ ఇచ్చారు.