Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది చైర్మెన్ల నియామకాలను నిలిపివేసిన ఢిల్లీ హైకోరు
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్ ఛాన్సెలర్ ఎం. జగదీష్ కుమార్ అధికారం లేకుండానే నియామకాలు చేశారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వీసీ నియమించిన తొమ్మిది మంది చైర్పర్సన్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. చైర్పర్సన్లను నియమించే అధికారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు స్పష్టంగా ఇవ్వబడిందనీ, వైస్ ఛాన్సెలర్కు కాదని జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ తల్వంత్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. యూనివర్సిటీలో వివిధ సెంటర్స్, ప్రత్యేక సెంటర్స్‌కు చైర్మెన్లుగా ప్రొఫెసర్లను వీసీ నియమించిన అంశంపై కోర్టు విచారణ చేపట్టింది. వీసీ చేసిన తొమ్మిది నియామకాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతిని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ అతుల్ సూద్ కోర్టును ఆశ్రయించారు. వీసీ నుంచి నియామకాలు జరగవని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. వీసీ తన అధికారాలను వినియోగించారని యూనివర్సిటీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ధర్మాసనం యూనివర్సిటీ వాదనను తోసిపుచ్చింది. 'అత్యవసర పరిస్థితుల దృష్ట్యా' తక్షణచర్య అవసరమైనప్పుడు మాత్రమే వీసీ అలాంటి అధికారాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 296వ సమావేశానికి సంబంధించిన ఎజెండాపై అతుల్ సూద్ అభ్యంతరం వ్యక్తం చేశారనీ, విసి నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలియజేసినట్లు గమనించిన న్యాయస్థానం, ఇది సరైనది కాదని స్పష్టం చేసింది.