Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. అధికంగా డెంగీ కేసులు నమోదవుతున్న తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నత స్థాయి బృందాలను కేంద్ర ప్రభుత్వం పంపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజారోగ్య పద్ధతులపై మద్దతు, వ్యాధి నివారణ, చికిత్స నిర్వహణపై సలహాలను ఇవ్వనున్నాయి. హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్లకు ఉన్నతస్థాయి బృందాలను కేంద్రం పంపింది. దేశంలో డెంగీ పరిస్థితిపై ఈ నెల 1న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుక్ మాండవియా సమీక్షా సమావేశం నిర్వహించారు.
డెంగీ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయాన్ని పెంచాలని మంత్రిత్వ శాఖకు ఆయన సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,16,991 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో డెంగీ కేసులు గణనీయంగా పెరిగినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించింది. 'ప్రస్తుత ఏడాదిలో మొత్తంగా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి, అక్టోబర్ 31 నాటికి దేశంలో మొత్తం డెంగీ కేసుల్లో ఈ రాష్ట్రాలు 86 శాతం వాటాను కలిగివున్నాయి' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు సహాయాన్ని, మద్దతును అందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. డెంగీ నియంత్రణ స్థితి, కిట్లు, ఔషధాల లభ్యత, కేసులను ముందస్తుగా గుర్తించడం, యాంటీ లార్వా, యాంటీ-వయోజన వెక్టర్ నియంత్రణ చర్యలు మొదలైన వాటి స్టేటస్‌పై నివేదిక ఇవ్వాలని బృందాలను కేంద్రం ఆదేశించింది. ఈ బృందాలు తమ పరిశీలనపై ఆయా ప్రభుత్వాల ఆరోగ్య అధికారులకు వివరిస్తారు.