Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురు హింసాకాండపై సుప్రీం న్యాయవాదుల కమిటీ రిపోర్టు
న్యూఢిల్లీ: మైనారిటీల లక్ష్యంగానే త్రిపురలో హింస చోటుచేసుకుందని సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇటీవల త్రిపురలో జరిగిన మత హింసాకాండ తర్వాత, ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఈ దాడులను ''మైనారిటీల (ముస్లింలపై) లక్ష్యంగా చేసుకున్న హింస'' అని ఆరోపించింది. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులపై దాడులు, విధ్వంసం, ఇండ్లకు నిప్పుపెట్టడం, దుకాణాలు, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు సంబంధించి గత నాలుగు రోజులుగా త్రిపుర నుంచి పలు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలతో కూడిన బృందం అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించింది. ఈ బృందంలో ఎహ్త్తెషామ్ హష్మీ, అమిత్ శ్రీవాస్తవ్, అన్సార్ ఇండోరి, ముఖేష్ వంటి ప్రముఖులు ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం.. మైనారిటీ వర్గానికి చెందిన కనీసం 12 మసీదులు, 9 దుకాణాలు, మూడు ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. పోలీసులు, పరిపాలనా యంత్రాంగం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలను ముందుగానే అరికట్టవచ్చని నిజనిర్ధారణ బృందం గుర్తించింది. 'ఈ హింస జరగడానికి నాలుగు రోజులు ముందు ముస్లిం సంస్థ జమాత్-ఇ-ఉలేమా (హింద్).. సీఎం విప్లబ్ కుమార్ దేవ్‌తో సమావేశమైంది. హిందువులు-ముస్లింల మధ్య శాంతికి ప్రమాదముందనీ, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ, ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఈ హింసకు పరోక్షంగా సహకరించడంతో సమానం'' అని ఈ నివేదిక పేర్కొంది. ''బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల ఘటనల నేపథ్యంలో త్రిపురలో 51 చోట్ల నిరసనలు జరిగాయి. నిరసన ప్రదర్శనల అనంతరం హింస మొదలైంది. ప్రభుత్వం సకాలంలో తగిన చర్యలు తీసుకుంటే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఘటలు జరిగివుండేవి కావు. ఇంత భయంకరమైన రూపాన్ని సంతరించుకునేవి కావు'' అని న్యాయవాది హష్మీ అన్నారు. అక్టోబరు 15న బంగ్లాదేశ్‌లోని పలు దుర్గా పూజా మండపాలు, దేవాలయాలను ధ్వంసం చేసిన తర్వాత బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు నిరసనలు కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించినట్టు ఈ బృందం తమ నివేదికలో పేర్కొంది.