Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకృతి విపత్తులతో 2020లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల నష్టం
- వాతారణ మార్పులు.. జీవజాతుల మనుగడపై తీవ్ర ప్రభావం
- ప్రపంచ వాతావరణ నివేదిక అందోళన
న్యూఢిల్లీ: అభివృద్ధి పేరిట చెట్ల నరికివేత, పర్వతాలు, కొండలు, మైదానాల, గనుల తవ్వకం వంటి చర్యలతో ప్రకృతి విధ్వంసం కొనసాగించడం, వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను, జలాశయాల్లోకి రసాయనాలను రికార్డు స్థాయిలో వదలడం కారణంగా వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక అందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదికలో ప్రస్తావించిన వివరాలు ప్రకారం. విపరీతమైన వాతావరణ మార్పుల కారణంగా 2020లో ఆసియా అంతటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహారం, నీటిని పొందడం క్లిష్టంగా మారింది. స్థిరమైన వృద్ధికి ముప్పు పొంచి ఉంది. పర్యావరణ క్షీణత కారణంగా వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఆయా దేశాలపై పడుతోందని నివేదిక పేర్కొంది. 'ముఖ్యంగా ప్రకృతి విపత్తులైన వరదలు, తుఫానులు, కరువులు చాలా దేశాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. వ్యవసాయం, ఆహార భద్రతను, ఆరోగ్య ప్రమాదాలను పెంచుతూ.. తీవ్ర స్థాయిలో ఆర్థిక నష్టాలను పెంచుతున్నాయి'' అని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెట్టేరి తాలాస్ అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా 2020లో ఆసియాలో సముద్ర ఉష్ణోగ్రతలు, అవపాతం, హిమానీనదుల తిరోగమనం, కుంచించుకుపోతున్న సముద్రపు మంచు, సముద్ర మట్టం పెరుగుదల, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు వంటి అనేక అంశాలను నివేదిక ప్రస్తావించింది. పైన పేర్కొన్న అంశాలతో పాటు కరోనా మహమ్మారి ఈ ప్రాంతంలో పకృతి విపత్తు నిర్వహణను మరింత క్లిష్టంగా మార్చిందని పేర్కొంది.
చైనా, భారత్, జపాన్లలో అధికం...
హిమాలయ శిఖరాల నుంచి లోతట్టు తీర ప్రాంతాల వరకు, జనసాంద్రత కలిగిన నగరాల నుంచి ఎడారుల వరకు, ఆర్కిటిక్ నుంచి అరేబియా సముద్రాల వరకు ఆసియాలోని ప్రతి భాగం ఎలా ప్రభావితమైందో నివేదిక వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు, వరదలు, కరువులు వందల బిలియన్ డాలర్ల సగటు వార్షిక నష్టానికి (ఏఏఎల్) కారణమ య్యాయి. ముఖ్యంగా చైనా, భారత్, జపాన్ ఈ నష్టాన్ని ఎక్కువగా అనుభవించాయి. చైనా సుమారు 238 బిలియన్ డాలర్లు, భారత్ 87 బిలియన్లు, జపాన్‌లో 83 బిలియన్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పరిమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఏఏఎల్ దాదాపు తజకిస్థాన్‌కు జీడీపీలో 7.9 శాతం, కంబోడియాకు జీడీపీలో 5.9 శాతం, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్కు జీడీపీలో 5.8 శాతం వరకు ఉంటుందని అంచనా. అత్యధిక ఏఏఎల్లు కరువులతోనే సంబంధం కలిగిఉన్నాయి.
2020లో తుఫానులు, వరదల కారణంగా దాదాపు 50 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారత్, చైనాలు అధికంగా నష్టపోయాయి. అలాగే, జపాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, బంగ్లాదేశ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో ఐక్యరాజ్య సమితి 2030 ఎజెండాను అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెప్పింది.