Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో 600 మంది రైతులపై కేసు
- నోయిడా అథారిటీకి వ్యతిరేకంగా 81 గ్రామాల అన్నదాతల ఆందోళన
నోయిడా (యూపీ): బీజేపీ నేత, గౌతమ్ బుద్ద్ నగర్‌కు చెందిన ఎంపీ డాక్టర్ మహేష్ శర్మ నివాసంవద్ద ఘెరావ్ చేసి, ప్రధాన రహదారి మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ.. 600 మంది రైతులపై యోగి సర్కార్ కేసు నమోదు చేయించింది.నోయిడా అథారిటీకి వ్యతిరేకంగా 81 గ్రామాల రైతులు తమ వివిధ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్నారు. భూసేకరణకు నష్టపరిహారం పెంపు, ప్లాట్ల అభివృద్ధి తదితర డిమాండ్లపై 63 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నోయిడా అథారిటీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న న్యాయపరమైన డిమాండ్ల గురించి అధికార యంత్రాంగంతో పాటు...ప్రజాప్రతినిధులెవరూ సానుకూలంగా మాట్లాడటం లేదని ఖలీఫా అన్నారు. ఆందోళనను ఉధృతం చేసే దిశగా సెక్టార్ 15-ఏ లోని ఎంపీ శర్మ నివాసాన్ని ఘెరావ్ చేయటానికి అన్నదాతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే ఎంపీ నివాసానికి కొద్ది దూరంలోనే పోలీసులు రైతులను అడ్డుకోగా..రోడ్డుపైనే బైటాయించారు. యోగి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ రైతులపై పోలీసులు కేసులు బనాయించారు. భారతీయ కిసాన్ పరిషత్ అధ్యక్షుడు సుఖ్బీర్ ఖలీఫా సహా దాదాపు 600 మందిపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కేసులు పెట్టినంతమాత్రాన వెనక్కి తగ్గమని, నోయిడా అథారిటీ నుంచి తమ డిమాండ్లు నేరవేరేదాకా ఉద్యమిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటానికి ఇది ఆరంభమేననీ, త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని వారు చెప్పారు.