Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోపాలున్నా ప్రభుత్వ అనుమతులు
- నిధుల కొరతతో రసాయనాలు, పరికరాలు కొనలేకపోతున్న ల్యాబ్ అధికారులు
- సైడ్ ఎఫెక్ట్స్‌ను బయటపెట్టే 'ఇంప్యూరిటీ టెస్ట్' జరపకుండానే ఆమోదం
న్యూఢిల్లీ : జలుబు, జ్వరం, వొళ్లు నొప్పులు...ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మార్కెట్లో కొన్ని వందల రకాల ఔషధాలు(ట్యాబ్లెట్స్, సిరప్స్) అమ్ముతున్నారు. ఏది సురక్షితమో ? ఏది కాదో? అమ్మేవాడికీ, కొనేవాడికీ తెలియదు. మనదేశంలోని అమ్ముతున్న ఔషధాలకు సంబంధించి వాటి ప్రమాణాలపై అనేక అనుమానాలు న్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఔషధాలకు అనుమతులు ఇస్తున్నారని, నిర్దేశించిన పరీక్షలు పూర్తి స్థాయిలో జరపటం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనికిసంబంధించి న్యూస్ వెబ్ పోర్టల్ 'దవైర్' తాజాగా ఒక వార్తా కథనం వెలువరిం చింది. దాంట్లోపేర్కొన్న అంశాలు ఈవిధంగా ఉన్నాయి..
ఒక కంపెనీ తయారుచేసిన ఔషధం మంచిదేనా? కాదా? అనేది తేల్చాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. నిర్దేషించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉందా? లేదా?అనేది పరీక్షించి గుర్తింపు ఇవ్వాల్సింది ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశోధనా (ల్యాబ్స్)కేంద్రాలే. ఈ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నా యి. అయితే ఈ ల్యాబ్స్ పూర్తిస్థాయిలో నాణ్యతా పరీక్షలు జరపటం లేదని తేలింది. ఉదాహరణకు నాగపూర్ ల్యాబ్‌లో 'ఇంప్యూరిటీ టెస్ట్' నిర్వహించటం లేదు. కారణం..దీనికి అవసరమయ్యే రసాయన పదార్థాల కొరత, పరికరాలు లేకపోవటం. వీటిని ల్యాబ్ అధికారులు సమకూర్చుకోవాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందుకోసంగాను ల్యాబ్‌లకు పెద్దమొత్తంలో నిధులు అవసరం అవుతాయి. గతకొన్నేండ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేయనందున 'ఇంప్యూరిటీ టెస్ట్' నిర్వహించలేకపోతున్నామని ల్యాబ్ ఉన్నతాధికారులు 'ద వైర్'కు తెలిపారు. ఇది ఒక్క మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్...ఏడు రాష్ట్రాల్లో ల్యాబ్‌లు నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయని తేలింది. ఇదంతా కూడా భారతదేశంలో ఔషధాల ప్రమాణాలపై ప్రభావం చూపుతోందని, అనుమానాలకు తావిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్‌ల్లో నిర్దేశించిన పరీక్షలు జరపకపోతే, రోగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) ఏర్పడతాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఔషధ తయారీ కంపెనీ నుంచి విడుదలైన ట్యాబ్లెట్స్‌పై నాగపూర్ ల్యాబ్‌లో నాణ్యతా ప్రమాణ పరీక్షలు జరిగాయి. ఇందులో అత్యంత కీలకమైన 'ఇంప్యూరిటీ టెస్ట్' నిర్వహించలేదని ల్యాబ్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించటం వివాదాస్పదమైంది. ఒక మందు బిళ్లలో ప్రమాదకర రసాయనాలు, సైడ్ ఎఫెక్ట్స్‌ను కలిగించేవి ఉన్నాయా? లేదా ?అన్నది 'ఇంప్యూరిటీ టెస్ట్' ద్వారా బయటపడుతుంది. ఒకవేళ ఈ టెస్ట్ జరపకుండానే ఆ మందుబిళ్లను రోగికి ఇచ్చినప్పుడు, అతడి ఆరోగ్యం మరింత దెబ్బతినొచ్చు. కొత్త ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
ల్యాబ్‌లకు నిధుల సమస్య
వివిధ రాష్ట్రాల్లోని ల్యాబ్‌ల్లో 'ఇంప్యూరిటీ టెస్ట్' నిర్వహించకపోవటం అత్యంత సహజమని, భారతదేశంలో ఔషధ ప్రమాణాలకు సంబంధించి రొటీన్‌గా పరీక్షలు జరిపి అనుమతులు ఇస్తున్నారని వార్తా కథనంలో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లోని ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించడానికి పరికరాలు, పదార్థాలు లేవని, నిధులు సమస్య తీవ్రస్థాయిలో ఉందని తేలింది. ''ఇంప్యూరిటీ టెస్ట్..అత్యంత కీలకమైంది. కొన్ని మందుబిళ్లల్లో ప్రమాదకర రసాయనాలుంటాయి. ఇవి రోగి ఆరోగ్యాన్ని కచ్చితంగా ప్రమాదంలో పడేస్తాయి'' అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో గ్లోబల్ హెడ్‌గా పనిచేసిన గనాదిష్ కామత్ చెప్పారు.