Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
- గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఘటనలు
పాట్నా : దీపావళి పండుగ వేళ బీహార్‌లో దారుణం చోటు చేసుకున్నది. కల్తీ మద్యం తాగి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అనారోగ్యం పాలయ్యి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందినవారిలో అధికం ఎస్సీలే కావడం గమనార్హం. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం 2016, ఏప్రిల్ 5 నుంచి రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని విధించిన విషయం విదితమే. అయినప్పటికీ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విశ్లేషకులు వివరించారు.
కొందరు సాక్షులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ బెట్టియాలోని తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం (దొంగ సారాయి) తాగడంతో ఈనెల 4న ఎనిమిది మంది చనిపోయారు. అలాగే, గోపాల్‌గంజ్‌లో మరో ఆరుగురు మృతి చెందినట్టు జిల్లా యంత్రాంగం ధ్రువీకరించింది. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య 16కు చేరింది. అయితే, ఈ రెండు జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు మాత్రం ఈ మరణాల వెనక గల కారణాలను ఇప్పటికీ ధ్రువీకరించలేదు. కాగా, ఉత్తర బీహార్‌లో 10 రోజుల క్రితం కల్తీ మద్యం ఘటన మరవకముందే తెల్హువాలో మరొకటి చోటు చేసుకోవడం గమనార్హం.
ఎన్డీయే ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర : మంత్రి జనక్‌రామ్
ఘటన అనంతరం బీహార్ మంత్రి జనక్‌రామ్ గోపాల్‌గంజ్‌కు వెళ్లారు. మృతుల కుటుంబాలను కలిశాననీ, అయితే, ఇదంతా ఎన్డీయే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్ర కావచ్చని మంత్రి ఆరోపించారు. మృతదేహాల పోస్టు మార్టం నివేదికలు వస్తే కానీ మరణాల వెనక గల కారణాన్ని ధ్రువీకరించలేమని గోపాల్‌గంజ్ ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కేసుపై మూడు బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయని వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు దహనం చేశారని స్థానిక పోలీసు ఒకరు తెలిపారు.
కేసు నమోదు..నలుగురి అరెస్టు
అయితే, కల్తీ మద్యం సేవించడంతోనే వీరు మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేశారు. ఈ ఘటనలతో సంబంధమున్న నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. అయితే, ఇక్కడి స్థానిక వ్యాపారులే ఈ కల్తీ మద్యం అమ్మినట్టు తెలుస్తున్నది. పోలీసులు సైతం వారిని గుర్తించారు. కాగా, చనిపోయినవారిలో దాదాపు 20 మంది దళితులే కావడం గమనార్హం. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఈ ఏడాది దాదాపు 70 మంది మరణించినట్టు పలు నివేదికల సమాచారం.
నితీశ్ బాధ్యత వహించరా? : తేజస్వీ యాదవ్
ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. మద్యపాన నిషేదం విషయంలో నితీశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మద్యపాన నిషేదంపై పెద్ద పెద్ద హామీలిచ్చే నితీశ్ కుమార్.. ఈ మరణాలకు బాధ్యులు కారా? అని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.