Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వరుసగా మూడో మాసం అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. 2011 జులై తర్వాత ఇంత తీవ్ర స్థాయికి చేరడం ఇదేనని ఎఫ్ఏఓ గురువారం పేర్కొంది. అక్టోబరులో ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు సగటున 133.2 పాయింట్లు నమోదు చేశాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) తన నెలవారీ నివేదికలో పేర్కొంది. సెప్టెంబరులో కన్నా ఇది మూడు పాయింట్లు ఎక్కువ. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 31.3శాతం ఎక్కువగా వుంది. తృణధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్ ధరలు బాగా పెరిగాయని తెలిపింది. పప్పు ధాన్యాల ధరలు సెప్టెంబరు మాసం కన్నా సగటున 3.2శాతం పెరిగాయి. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే 22.4శాతం పెరిగాయి. అన్ని ప్రధాన పప్పు ధాన్యాల ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. వీటిలో గోధుమలు 5శాతం పెరిగాయి. 2012 నవంబరు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే ప్రధమం. ప్రధానంగా ఎగుమతి చేసే దేశాలు ముఖ్యంగా కెనడా, అమెరికా, రష్యా వంటి దేశాలు గోధుమ పంట వేయడాన్ని తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లో తక్కువగా దొరకడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. చమురు ధరలు కూడా గతనెల్లో 9.6శాతం పెరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది ఎక్కువే. వెన్న, పాల పౌడర్ ధరలు కూడా పెరగగా మాంసం ధర మాత్రం గతనెలతో పోలిస్తే 0.7శాతం తగ్గింది. అలాగే చక్కెర ధర కూడా గతనెలతో పోలిస్తే 1.8శాతం తగ్గింది.